TDP Mahanadu: 30 ఏళ్ల తర్వాత మరోసారి రాజమహేంద్రవరంలోనే..: తెదేపా నేతలు

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెదేపా మహానాడుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Published : 26 May 2023 16:07 IST

కడియం: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెదేపా మహానాడుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇవాళ పలువురు తెదేపా నేతలు మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. తెదేపా నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, కంభంపాటి రామ్మోహన్‌ రావు, చింతకాయల విజయ్‌ సభా స్థలికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి మహానాడు వేదికను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు వారు చెప్పారు. మొదటిసారి ప్రవేశ ద్వారం వద్ద క్యూఆర్ కోడ్ సాంకేతికతను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘మహానాడు, ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు.. ఈ రెండింటికీ రాజమహేంద్రవరం వేదిక కానుంది. 1993లో రాజమహేంద్రవరంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాం. 1994లో తెదేపా అధికారంలోకి వచ్చింది. మళ్లీ 30 ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి రాజమహేంద్రవరంలోనే ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. 2024 మళ్లీ తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. రాజమహేంద్రవరం ‘మహానాడు’తో రానున్న ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం’’ అని తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేశారు.

మహానాడులో తొలి మేనిఫెస్టోను తెదేపా ప్రకటించనుంది. ఇందులో మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రయోజనం చేకూర్చే అంశాలను పొందుపరచనున్నారు. దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. సభాధ్యక్షత నిర్వహణ నుంచి ప్రసంగాలు, తీర్మానాలు ప్రవేశపెట్టడం వరకు ఈసారి కొత్త వారికే అవకాశం ఇవ్వనున్నారు. 26న రాజమహేంద్రవరంలో పొలిట్‌బ్యూరో సమావేశం, 27న ప్రతినిధుల సభ, 28న బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని