Madhya Pradesh Elections: ద్విముఖ పోరులో సవాళ్లెన్నో..!

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పోటీదారులు కాంగ్రెస్‌, భాజపా ఎదుర్కోవాల్సిన ప్రధాన సమస్యలేంటి?

Updated : 17 Oct 2023 17:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల (Madhya Pradesh Elections) వేడి రాజుకుంది. అధికార భాజపా (BJP) జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దింపగా... ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Congress) కూడా పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. రూ.25 లక్షల ఆరోగ్య బీమా (Health Insurance), రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సహా 59 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది. అన్ని వర్గాలను ఆకర్షించేలా  మేనిఫెస్టో రూపొందించింది. 2020లో తమ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపాపై ప్రతీకారం తీర్చుకోవాలని హస్తం పార్టీ ఉవ్విళ్లూరుతుండగా.. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలదళం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ద్విముఖ పోరులో ఆయా పార్టీలు ఎదుర్కోబోతున్న ప్రధాన సవాళ్లేంటి?

1. ప్రభుత్వ వ్యతిరేకత

సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన భాజపా నేత శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని ముందే గుర్తించిన భాజపా అధిష్ఠానం జాతీయ స్థాయి నాయకులు ఏడుగుర్ని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టింది. వారిలో ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలు, ఒక జనరల్‌ సెక్రెటరీ ఉన్నారు. మరోవైపు తాజా ఎన్నికల్లో శివరాజ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండబోరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధిష్ఠానం కూడా శివరాజ్‌పై సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఆ  ఏడుగురిలో ఎవరికైనా పగ్గాలు అప్పగించాలని భాజపా అధిష్ఠానం భావిస్తోంది.

2. హిందుత్వం

భాజపా చేపడుతున్న జన ఆశీర్వాద యాత్రల్లో హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తోంది. సనాతన ధర్మంపై విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు చేసిన వ్యాఖ్యల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి హిందూ ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలని చూస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఉజ్జయినిలోని మహాకాళ్‌ లోక్‌ కారిడార్‌,  ఓంకారేశ్వర్‌లో ఆదిశంకరాచార్యుల విగ్రహం ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ..వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

మరోవైపు కాంగ్రెస్‌ కూడా తాము హిందుత్వ వ్యతిరేకం కాదని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్‌నాథ్‌ తాను హనుమాన్‌ భక్తుడినని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం, తన స్వస్థలం చింద్వాడాలో హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన, భజరంగ్‌ సేనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.

రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌!

3. ఓబీసీలు ఎవరి వైపో..!

తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని హమీ ఇచ్చిన కాంగ్రెస్‌.. ఓబీసీలు తమకు వెన్నుదన్నుగా నిలుస్తారని భావిస్తోంది. మధ్యప్రదేశ్‌ మొత్తం జనాభాలో వీరి వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుంది. గతంలో వీరంతా భాజపాకు అనుకూలంగా ఉండేవారు. శివరాజ్‌ సింగ్ చౌహాన్‌కు ముందు.. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా పని చేసిన ఉమాభారతి, బాబూలాల్‌ గౌర్‌లు ఓబీసీ నేతలే. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓబీసీకి చెందిన వ్యక్తే కావడం భాజపాకి రాష్ట్రంలో బాగా కలిసొచ్చింది. తాజాగా కాంగ్రెస్‌ కులగణన చేపడతామని హామీ ఇవ్వడంతోపాటు మహిళా రిజర్వేషన్‌లోనూ ఓబీసీ కోటాను తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో ఓబీసీలు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.

4. మహిళలే సగం

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో మొత్తం ఓటర్లు 5.52 కోట్లు కాగా.. అందులో 2.67 కోట్ల మంది మహిళలు. అంటే దాదాపుగా పురుష ఓటర్లతో సమానంగా ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం మహిళలకే కేటాయిస్తామని భాజపా చెబుతుండగా.. కాంగ్రెస్‌ కూడా మహిళా అనుకూల పథకాలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా భాజపా హయాంలో మహిళలపై జరిగిన వేధింపులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, తద్వారా భాజపాపై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల ఉజ్జయిని ప్రాంతంలో ఓ మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచారాన్ని, ఆమె సాయం కోసం ఇంటింటికీ తిరిగిన వైనాన్ని ఇందుకు అస్త్రంగా ఉపయోగించుకుంటోంది.

5. ఆదివాసీలు

2018 ఎన్నికల్లో భాజపాపై ఆదివాసీ ఓట్లు తీవ్ర ప్రభావం చూపించాయి. మధ్యప్రదేశ్‌లోని ఓటర్లలో దాదాపు 21శాతం మంది ఆదివాసీలు. మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 47 స్థానాలను ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. 2018 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో భాజపా కేవలం 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా.. కాంగ్రెస్‌ 31 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వారి ఆకర్షించేందుకు భాజపా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే అక్టోబర్‌ 5న ప్రధాని మోదీ.. ఆదివాసీల ఆరాధ్యురాలు రాణి దుర్గావతి 500 జయంతి ఉత్సవాలను నిర్వహించారు. మరోవైపు భాజపా ప్రభుత్వ హయాంలో ఆదివాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలను కాంగ్రెస్‌ హైలైట్‌ చేస్తోంది.

6. ఎస్సీలు

మధ్యప్రదేశ్ రాష్ట్ర జనాభాలో 17శాతం మంది ఎస్సీలు. వారికి 35 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. బుందేల్‌ఖండ్‌, గ్వాలియర్‌ -చంబల్, వింధ్య ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఎస్సీ ఓట్లు చాలా కీలకం. 2018 ఎన్నికల్లో ఆయా స్థానాల్లో కాంగ్రెస్‌ 17 నియోజకవర్గాల్లోనూ, భాజపా 18 నియోజక వర్గాల్లో విజయం సాధించింది. 2013 ఎన్నికల్లో భాజపా 28 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్‌ మాత్రం 4 స్థానాలకు పరిమితమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎస్సీ ఓటర్లను ఆకర్షించేందుకు భాజపా ఎస్సీ ప్రముఖలకు సంబంధించిన వేడుకలను నిర్వహిస్తోంది. అదేసమయంలో ఎస్సీలపై జరిగిన దౌర్జన్యాలను కాంగ్రెస్‌ ప్రస్తావిస్తోంది.

7. అవినీతి

కర్ణాటక తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ భాజపా అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.  ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా కమల్‌నాథ్‌తో సహా పార్టీ నేతలంతా చౌహాన్‌ ప్రభుత్వాన్ని ‘ 50శాతం కమిషన్‌’ ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారు. భాజపా హయాంలో అవినీతికి అంతులేకుండా పోయిందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.  రాష్ట్రంలో 18 ఏళ్ల భాజపా పాలనలో 250 కుంభకోణాలు చోటు చేసుకున్నట్లు కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ ప్రియాంక గాంధీ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ విమర్శలను భాజపా తనదైన శైలిలో తిప్పికొడుతోంది. కాంగ్రెస్‌ నేతలు చేసిన కుంభకోణాలు రూ.20 లక్షలకోట్లకు పైగానే ఉంటాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌ నెలలో భోపాల్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో విమర్శించారు.

8. రైతు సమస్యలు

రాష్ట్ర జనాభాలో 70 శాతం మంది రైతులే. గిట్టుబాటు ధర, పెట్టుబడి, వాతావరణ మార్పులు, వసతుల లేమి తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వారిని తమవైపు తిప్పుకునేందుకు భాజపా, కాంగ్రెస్‌లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రూ.2 లక్షల మేర రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పేర్కొంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి రైతులు కూడా ఒక కారణమని విశ్లేషకులు చెబుతారు. గిట్టుబాటు ధర కల్పించాలంటూ 2017లో మందసౌర్‌లో నిరసన చేపడుతున్న రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్‌.. రైతు రుణాల మాఫీ, ఉచిత విద్యుత్‌, 37 లక్షల మంది రైతులకు ఉచిత నీటిపంపులు లాంటి రైతు అనుకూల విధానాలను ప్రకటించి ఓటర్లను ఆకర్షించింది.

9. నిరుద్యోగం

మధ్యప్రదేశ్‌లో మరో ప్రధాన సమస్య నిరుద్యోగం. గత మార్చి నెలలో ఓ సర్వే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 39,93,149 మంది యువత ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. భాజపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,298 మంది విద్యార్థులు, 6,999 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ‘ లెర్న్‌ అండ్‌ ఎర్న్‌’ లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చిన భాజపా.. గత మూడేళ్లలో 61 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెబుతోంది. కానీ, కాంగ్రెస్‌ మాత్రం కేవలం 21 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్లు లెక్కలు చూపిస్తోంది.

ఈ తరహా సవాళ్లను ఎన్నికలకు ముందు భాజపా, కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటాయో.. ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలియాలంటే డిసెంబరు 3న ఫలితాలు వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని