Madhya Pradesh Elections: రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌!

త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్ర ప్రజలందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమాతో సహా 59 హామీలిచ్చింది.

Updated : 17 Oct 2023 16:29 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల (Madhyapradesh Assembly Elections) నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Congress) హామీల వర్షం కురిపించింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని పేర్కొంది. ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్‌, ఐపీఎల్‌ జట్టు ఏర్పాటు సహా 59 హామీలిచ్చింది. ఈ మేరకు మంగళవారం 106 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, రైతుల సహా అన్నివర్గాల ప్రజలు లబ్ధిపొందేలా మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆయన తెలిపారు. 

రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌

అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ను కేవలం రూ.500కే అందజేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. దీంతోపాటు రూ.2 లక్షల మేర రైతు రుణాలను మాఫీ చేస్తామని, అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1500 భృతి చెల్లిస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది. రూ.10 లక్షల మేర ప్రమాద బీమా కూడా కల్పిస్తామని తెలిపింది. పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేస్తామని, పాఠశాల విద్యను పూర్తి ఉచితంగా అందించడంతోపాటు, నిరుద్యోగ యువతకు వాళ్ల అర్హత ఆధారంగా నెలకు రూ.1,500 నుంచి రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. 

మధ్యప్రదేశ్‌లో తొలివిడతగా 144 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్‌ను ఈసారి కూడా ఛింద్వాడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని పార్టీ నిర్ణయించింది. రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్‌ తనయుడు జైవర్ధన్‌ సింగ్‌.. రాఘోగఢ్‌ నుంచి, సోదరుడు లక్ష్మణ్‌సింగ్‌.. చాచౌరా నుంచి పోటీ చేయనున్నారు. కమల్‌నాథ్‌ సర్కారులో జైవర్ధన్‌ మంత్రిగా సేవలందించారు. వీరిద్దరూ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌పై నటుడు విక్రమ్‌ మస్తాల్‌ పోటీ చేయనున్నారు. 17 మంది మాజీ మంత్రులకు తొలి జాబితాలో స్థానం లభించింది. మొత్తం 39 మంది ఓబీసీలు, 22 మంది ఎస్సీలు, 30 మంది ఎస్టీలకు అవకాశం ఇచ్చారు. మైనారిటీల్లో ఆరుగురు, మహిళల్లో 19 మంది టికెట్లు పొందారు. 144 మందిలో 65 మంది యాభై ఏళ్ల లోపువారే. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని