Mamata: ‘దేవుడు పంపిన ప్రతినిధి’ వ్యాఖ్యలు.. మోదీపై దీదీ ధ్వజం

భాజపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

Published : 24 May 2024 18:44 IST

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆమె.. దేవుడు పంపిన సాధనమంటూ ప్రధాని చెప్పుకోవడంపైనా తీవ్రంగా మండిపడ్డారు. సుందర్‌బన్‌ ప్రాంతంలోని మథురాపుర్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల సభలో పాల్గొన్న దీదీ.. కాషాయ పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు.

‘దేవుడు పంపించిన వ్యక్తులమని కొందరు ప్రకటించుకుంటున్నారు. అలాంటివారు అల్లర్లకు పురికొల్పడం, ప్రకటనల ద్వారా తప్పులు ప్రచారం చేయడం, ఎన్‌ఆర్‌సీ చేపట్టి ప్రజలను జైల్లో వేయడం, పనికి ఆహార పథకం నిధులను నిలిపివేయడం, ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చి వెనక్కివెళ్లడం వంటి పనులు చేస్తారా? అని ప్రధాని మోదీపై మమతా బెనర్జీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పూరీ జగన్నాథుడిపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపైనా దీదీ మండిపడ్డారు.

Maneka Gandhi: మేనకాగాంధీ ఒంటరిపోరు

ఇటీవల ఓ జాతీయ వార్తా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ.. ‘‘మాతృమూర్తి చనిపోయిన తర్వాత ఓసారి వెనక్కి తిరిగి చూసుకున్నా. నన్ను దేవుడు పంపించి ఉండవచ్చు అని అనుకున్నా. ఈ బలం నా శరీరానిది కాదు. నేను దేవుడు పంపిన సాధనం కంటే మరోటి కాదు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీటిపైనే మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు