Mayawati: ఏకపక్ష ఫలితాలు ఆందోళనకరం: మాయావతి

లోక్‌సభ ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేసేందుకు బీఎస్పీ జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇక తాజాగా విడుదలైన ఎన్నికల ఫలితాలపై ఆపార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు.

Updated : 04 Dec 2023 13:27 IST

ఇంటర్నెట్‌డెస్క్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ప్రజలను ఆశ్చర్యం కలిగించడంతోపాటు భయపెట్టాయని ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నారు. ఈ ఫలితాలపై చర్చించి.. 2024 లోక్‌సభ ఎన్నికలపై వ్యూహాన్ని ఖరారు చేసేందుకు డిసెంబర్‌ 10న సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

‘మీ ఓటమి అసహనాన్ని పార్లమెంట్‌లో చూపించొద్దు’: కాంగ్రెస్‌కు మోదీ సూచన

‘‘రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణలో ప్రచార సమయంలో పరిస్థితి చూస్తే.. హోరాహోరీ పోరు తప్పదనిపించింది. కానీ, ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏకపక్షంగా వచ్చిన ఈ ఫలితాలు చూసి ప్రజలు సందేహపడటం, ఆశ్చర్యపోవడం, భయపడటం సహజమే. ఎన్నికల వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకొంటే.. ఇలాంటి విచిత్రమైన ఫలితాలు చూసి ఆమోదించడం ప్రజలకు కష్టమే. ప్రజానాడిని గ్రహించడంలో ఘోరంగా విఫలం కావడం చర్చనీయాంశం. ఈ ఎన్నికల్లో బీఎస్పీ సభ్యులు పూర్తి శక్తియుక్తులతో పోరాడారు. వారు ఈ ఫలితాలను చూసి నిరాశ చెందకూడదు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో కష్టాలపై నిరంతరం పోరాడుతుండాలి’’ అని మాయావతి పేర్కొన్నారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికలకు వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు బీఎస్పీ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా 10వ తేదీన ఆల్‌-ఇండియా స్థాయిలో పార్టీ నాయకులతో లఖ్‌నవూలో భేటీ ఏర్పాటు చేసింది.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో భాజపా విజయం సాధించగా.. తెలంగాణ కాంగ్రెస్‌ ఖాతాలో పడింది.

దేశంలోని రెండు ప్రధాన రాజకీయ కూటముల్లో చేరికపై బీఎస్పీ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. అధికార ఎన్డీయేకిగానీ, ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమికిగానీ మద్దతిచ్చేది లేదని తెలిపింది. సొంత బలంతోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బీఎస్పీ ఉత్తర్‌ప్రదేశ్‌ శాఖ ఇటీవల ప్రకటన విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని