PM Modi: ‘మీ ఓటమి అసహనాన్ని పార్లమెంట్‌లో చూపించొద్దు’: కాంగ్రెస్‌కు మోదీ సూచన

PM Modi: అసెంబ్లీ ఎన్నికల్లో సుపరిపాలనకు పట్టం కట్టిన ప్రజలు.. నెగెటివిటీని ప్రచారం చేసేవారిని ఓడించారని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఫలితాలపై స్పందించారు.

Updated : 04 Dec 2023 21:25 IST

దిల్లీ: ఉత్తరాదిన మూడు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Assembly Election Results) కాషాయ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కమలం పార్టీ విజయ ఢంకా మోగించింది. ఈ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) మరోసారి స్పందించారు. ప్రజలు నెగెటివిటీని తిరస్కరించారని ప్రతిపక్షాలనుద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. శీతాకాల సమావేశాల నిమిత్తం పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మీడియాతో మాట్లాడారు.

‘‘ఈసారి శీతాకాలం కాస్త ఆలస్యమైంది. రాజకీయ వేడి మాత్రం విపరీతంగా పెరిగింది. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయి. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారు. మహిళ, యువత, రైతులు, పేదలే ప్రధాన కులాలని నమ్మి.. వారి సాధికారత కోసం పనిచేస్తున్న వారికి ప్రజల నుంచి మద్దతు లభించింది. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం ఉండదని రుజువైంది’’ అని ప్రధాని తెలిపారు.

ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ (Congress) పార్టీకి ఆయన సూచనలు చేేశారు. ‘‘నెగెటివిటీని ఈ దేశం తిరస్కరించింది. ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్ష సభ్యులకు నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఇది వారికి సువర్ణావకాశం. ఈ ఓటమిపై విసుగు చెంది ఆ నిరాశను పార్లమెంట్‌లో చూపించాలనుకునే ఆలోచనలు మానాలి. గత 9 ఏళ్లుగా వారికి అలవాటుగా మారిన నెగెటివిటీని పక్కనబెట్టి ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే.. ఈ దేశం కూడా వారిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. వారు ప్రతిపక్షంలో ఉన్నా సరే.. వారికో సలహా ఇస్తున్నా. ప్రతి ఒక్కరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మీ ఓటమి తాలూకు అసహనాన్ని పార్లమెంట్‌లో ప్రదర్శించొద్దు’’ అని మోదీ కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఇక, శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో సభ్యులంతా ఫలప్రదమైన చర్చలు జరపాలని కోరారు. నేటి నుంచి డిసెంబరు 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని