TDP-Janasena: తెదేపా, జనసేన మేనిఫెస్టోలో మరో కీలక హామీ.. చర్చించిన నేతలు

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం-జనసేన వ్యూహరచన చేస్తున్నాయి.

Updated : 22 Feb 2024 17:31 IST

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం-జనసేన వ్యూహరచన చేస్తున్నాయి. ఈ మేరకు ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని నోవాటెల్‌లో గురువారం కీలక భేటీ నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశంపై చర్చించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశారు. తాడేపల్లిగూడెం సభలో కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్టు సమాచారం.

ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించారు. తెదేపా సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్‌, పాలవలస యశస్విని హాజరయ్యారు. వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై తెదేపా, జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. వాలంటీర్లను పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఇరుపార్టీల నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేశారు.

ఐదేళ్ల పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేశారు

‘‘వైకాపా పాలనను ఐదు కోట్ల మంది ప్రజలు అసహ్యించుకుంటున్నారు. గెలవలేనని తెలిసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్‌ ప్రయత్నం చేస్తున్నారు. వైకాపా నేతలు మీడియాపై దాడులు చేస్తున్నారు. మీడియాపై దాడులను ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశాం. ఐదేళ్ల పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేశారు. దేశవ్యాప్తంగా మన రాష్ట్ర పరువు తీశారు. ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పుకోలేకుండా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ - అచ్చెన్నాయుడు

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చించుకున్నాం

‘‘రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చించుకున్నాం. ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదని పవన్‌ కల్యాణ్‌ పలుమార్లు చెప్పారు. రెండు పార్టీలు కలిసి పనిచేసుకునే సమయం వచ్చింది. అన్ని స్థాయిల్లో కలిసి పనిచేయాలని కార్యకర్తలను కోరుతున్నాం’’ - నాదెండ్ల మనోహర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని