Botsa satyanarayana: భారాస దెబ్బకు ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోయిందనేది అవాస్తవం: బొత్స

భారాస దెబ్బకు ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోయిందనేది అవాస్తవమని.. ఈ అంశంపై భారాస, జనసేన కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రం పట్ల, అభివృద్ధిపై అఖిలపక్షాలకు చిత్తశుద్ధి లేదని.. అందుకని తామే ఒంటరిగా పోరాటం చేస్తున్నామని తెలిపారు.

Updated : 15 Apr 2023 17:22 IST

శ్రీకాకుళం: విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడి వాస్తవమని.. ఆ దాడిని స్వయంగా ఆయనే చేయించుకున్నారనే భావన కల్పిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ రిపోర్టును కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అలిపిరి వద్ద తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేశారని.. రాజకీయ లబ్ధి కోసం ఆయనే ఆ దాడి చేయించుకున్నారా? అని ప్రశ్నించారు. కోడికత్తితో దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశంతో అలా చేశాడో తెలియాల్సి ఉందన్నారు. జగన్‌పై జరిగిన ఈ దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే వైకాపా డిమాండ్‌ అని మంత్రి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న బొత్స.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

‘‘విశాఖ ఉక్కుపై మా విధానం ఒక్కటే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మా నినాదం. ప్రైవేటీకరణకు మా ప్రభుత్వం వ్యతిరేకం. ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపేయాలని పోరాడుతున్నాం. అఖిలపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదు. అందుకే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని దిల్లీకి తీసుకువెళ్లటం లేదు. అఖిలపక్ష పార్టీలపై మాకు నమ్మకం లేదు. భారాస దెబ్బకు ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోయిందనేది అవాస్తవం. భారాస, జనసేన కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రం పట్ల, అభివృద్ధిపై తెదేపాకు చిత్తశుద్ధి లేదు. అందుకని మేమే ఒంటరిగా పోరాటం చేస్తున్నాం’’ అని బొత్స వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని