Andhra News: మూడేళ్లలో జగన్‌ సర్కార్‌ చేసిన అప్పు రూ.1.34 లక్షల కోట్లే: మంత్రి బుగ్గన

ఏపీ ఆర్థిక పరిస్థితిపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,34,452 కోట్లు మాత్రమే అప్పు చేసిందని స్పష్టం చేశారు.

Updated : 04 Feb 2023 20:25 IST

అమరావతి: ఏపీ ఆర్థిక అంశాలపై తెదేపా (TDP) సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu) చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (Minister Buggana Rajendranath Reddy) స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై యనమల నిరాధార ఆరోపణలు, అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ విషయంపై తెదేపా రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని మంత్రి బుగ్గన విమర్శిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేశారు. స్థిరధరల వృద్ధి రేటులో 2021-22 ఏడాదికి సంబంధించి ఏపీ 11.22 శాతం వృద్ధి నమోదు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ఏవిధంగా లెక్కవేసినా మైనస్‌ 4శాతం వృద్ధి అనేది అసాధ్యమని మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ సమయంలో దేశ వృద్ధిరేటు -6.60 శాతంగా నమోదైతే ఏపీ 0.08శాతం మేర వృద్ధి నమోదు చేసిందన్నారు. 

అనుభవజ్ఞుడైన యనమల జీఎస్డీపీని గణించటంలో తప్పుచేశారని మంత్రి బుగ్గన ఆక్షేపించారు. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు రూ.1.92 లక్షల కోట్లు అందించినట్టు వెల్లడించారు.  ప్రతి గ్రామంలో ఏర్పాటైన సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజి క్లీనిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు, మిల్క్ చిల్లింగ్ కేంద్రాలను అభివృద్ధిగా పరిగణించరా? అని మంత్రి ప్రశ్నించారు. ‘ఖజానా ఖాళీ.. రూ.100 కోట్లు మాత్రమే మిగిలింది’ అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శ్రీలంక, జింబాబ్వేలా తయారైందని వ్యాఖ్యలు చేయటం బాధ్యతా రాహిత్యమన్నారు. 40ఏళ్లు పైబడిన యువనాయకుడు సీఎంగా ఎలా అభివృద్ధి చేస్తున్నాడో అర్థంకాక తెదేపా నేతలు తలలు పట్టుకుంటున్నారని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. 2019లో తెదేపా దిగిపోయే నాటికి రూ.2,64,451 కోట్ల అప్పు ఉంటే.. 2022 నాటికి రూ.3,98,903 కోట్లు అయినట్టు పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని తెలిపారు. గత మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,34,452 కోట్లు మాత్రమేనని బుగ్గన స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు