Uttam kumar reddy: ఆరోపణల్లో పైసా నిజం లేదు

భాజపా, భారాసలు కుమ్మక్కై అబద్ధాలు, అవాస్తవాలతో రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తాను రూ.వంద కోట్లు దిల్లీకి పంపానని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నయాపైసా నిజం లేదని స్పష్టం చేశారు.

Updated : 27 May 2024 03:49 IST

మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
విపక్ష నేతలపై మండిపడిన ఉత్తమ్‌
మహేశ్వర్‌రెడ్డి పదవిని కొనుక్కున్నారని ఆరోపణ

మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్‌. పక్కన శ్రీధర్‌బాబు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా, భారాసలు కుమ్మక్కై అబద్ధాలు, అవాస్తవాలతో రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తాను రూ.వంద కోట్లు దిల్లీకి పంపానని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నయాపైసా నిజం లేదని స్పష్టం చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పట్లోళ్ల సంజీవరెడ్డి, పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 

కిషన్‌రెడ్డి కన్నా వేగంగా ఎదగాలని మహేశ్వర్‌రెడ్డి ప్రయత్నం

‘‘నేను మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని భారాస నేత కేటీఆర్, భాజపా నేత మహేశ్వర్‌రెడ్డిలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోను. డబ్బు తీసుకోవడం కాదు కదా.. కనీసం మిల్లర్లను వ్యక్తిగతంగా కూడా కలవలేదు. వారి సంఘం తరఫున వస్తేనే మాట్లాడాను. మేం సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు. భాజపా, భారాస నేతలు టెండరు షరతులకు లోబడి.. సన్న బియ్యం కిలో రూ.42 చొప్పున అమ్మితే ప్రభుత్వం కొంటుంది. మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం మాదే. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన రైస్‌ మిల్లర్ల కోసమే భాజపా, భారాస మాట్లాడుతున్నాయి. భాజపా నేత మహేశ్వర్‌రెడ్డి దిల్లీలో భాజపా నేతలకు డబ్బులు పంపి రాష్ట్ర శాసనసభాపక్ష నేత పదవి కొనుక్కున్నారు.  భాజపాలో కిషన్‌రెడ్డిని అధిగమించి పదవులు పొందాలని, ఓవర్‌ స్పీడ్‌గా పోవాలని  అనుకుంటున్నారు. కొందరు నేతలు గతంలో మంత్రుల వద్దకు వెళ్లి.. భూముల విషయం మాట్లాడుకుని, బయటికొచ్చి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడినట్లు చెప్పుకొనేవారు. మాది అలాంటి సంస్కారం కాదు. సన్నరకం ధాన్యం అమ్మకాలకు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిస్తే క్వింటాకు ధర రూ.1700 వచ్చింది. మేం అధికారంలోకి వచ్చాక రూ.2400 వస్తోంది. గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు’’ అని ఉత్తమ్‌ అన్నారు. 

పీఎం కార్యాలయ ఒత్తిడితో ఇక్కడి పరిశ్రమలు ఉత్తరాదికి: మంత్రి శ్రీధర్‌బాబు

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, భారాస కలిసిపనిచేసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. ప్రతిపక్షాల విమర్శలకు తమ ప్రభుత్వ పనితీరే సమాధానమని అన్నారు. ‘‘ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే పనులకు, పాలనకు అడ్డొస్తే సహించేదిలేదు. గత భారాస ప్రభుత్వం చేసిన పొరపాట్లు మేం చేయం. సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు అబద్ధాలు చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. గత సంవత్సరం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో 121సార్లు కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. ఇటీవల సాంకేతిక కారణాలతో కాసేపు కరెంటు ఆగితే కోతలు విధిస్తున్నారని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో అదే ఆసుపత్రిలో రోగిని ఎలుకలు కొరికాయి. ప్రధానమంత్రి కార్యాలయం తెస్తున్న ఒత్తిడితో ఇక్కడి పరిశ్రమలను వాటి యాజమాన్యాలు ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నాయి. అయినా వాటిని మించిన పరిశ్రమలను మేం తీసుకువస్తాం’’ అని శ్రీధర్‌బాబు చెప్పారు. గత 5 ఏళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదని, తాము 5 నెలల్లో చేయబోతున్నామని జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా.. అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని