LS Polls: ‘మహాయుతి’కే మద్దతు.. ఎన్నికల్లో మోదీ వెంటే: రాజ్‌ ఠాక్రే

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, శివసేన, ఎన్‌సీపీలతో కూడిన అధికార మహాయుతి కూటమికే బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ఉద్ధవ్‌ సోదరుడు, ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే ప్రకటించారు.

Published : 09 Apr 2024 23:05 IST

ముంబయి: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections) వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో భాజపా, శివసేన, ఎన్‌సీపీలతో కూడిన అధికార మహాయుతి (Mahayuti) కూటమికే బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ఉద్ధవ్‌ సోదరుడు, మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన (MNS) అధినేత రాజ్‌ ఠాక్రే (Raj Thackeray) ప్రకటించారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. రానున్న ఎన్నికలు దేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని, తమ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటే ఉంటుందని చెప్పారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష ‘మహా వికాస్ అఘాడీ (MVA)’ భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, శరద్‌ పవార్‌ ఎన్‌సీపీ వర్గం, ఉద్ధవ్‌ ఠాక్రే శివసేనల మధ్య సీట్ల సర్దుబాటుపై ఒప్పందం వెలువడిన రోజే రాజ్‌ఠాక్రే ఈ ప్రకటన చేశారు. అదేవిధంగా ఈ ఏడాది నిర్వహించనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకూ సిద్ధం కావాలని ఎంఎన్‌ఎస్‌ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎంఎన్‌ఎస్‌ ఇప్పటివరకు ఒక్క అభ్యర్థినీ ప్రకటించలేదు.

ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్‌కు చెక్‌ పెట్టేందుకు రంగంలోకి రాజ్‌..!

బాల్‌ ఠాక్రేకు స్వయాన సోదరుడి కుమారుడే రాజ్‌ఠాక్రే. ఉద్ధవ్‌తో విభేదాల కారణంగా 2006లో శివసేన నుంచి బయటకు వెళ్లిపోయారు. 2009లో ఆయన నేతృత్వంలోని ఎంఎన్‌సీ 13 ఎమ్మెల్యే స్థానాలను సాధించింది. కానీ, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఆ పార్టీ తిరిగి బలపడాలంటే ఓ పెద్ద అండ అవసరం. భాజపా రూపంలో అది లభిస్తుందని రాజ్‌ ఆశిస్తున్నారు. రాజ్‌ఠాక్రే తన కుమారుడుతో కలిసి ఇటీవల దిల్లీలో భాజపా అగ్రనాయకుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే మహాయుతి కూటమికి మద్దతు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని