NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్‌కు చెక్‌ పెట్టేందుకు రంగంలోకి రాజ్‌..!

మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి వేగంగా పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది.   

Published : 19 Mar 2024 16:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శివసేన ఉద్ధవ్‌ వర్గం భారీ సంఖ్యలో ఓట్లను చీల్చకుండా ఎన్‌డీఏ కూటమి వ్యూహానికి మరింత పదును పెట్టింది. వీలైనన్ని పార్టీలను కూటమిలో చేర్చుకొని మహారాష్ట్రలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను సాధించాలని చూస్తోంది. ఉద్ధవ్‌ సోదరుడు, మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన అధినేత రాజ్‌ ఠాక్రేను తమ జట్టులో చేర్చుకొనేందుకు ఎన్డీఏ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే రాజ్‌ తన కుమారుడుతో కలిసి దిల్లీలో భాజపా అగ్రనాయకుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ పరిణామాలతో లోక్‌సభ ఎన్నికల వేళ కూటమిలో చేరడం ఖాయమనే ప్రచారం జోరందుకొంది. 

సోమవారం రాత్రే రాజ్‌ తన కుమారుడితో కలిసి దిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘దేశ రాజధానికి రమ్మని పిలిచారు. వచ్చాను.. చూద్దాం ఏం జరుగుతుందో’’ అని విలేకర్ల వద్ద వ్యాఖ్యానించారు. అప్పటికే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులే దిల్లీలోనే ఉన్నారు. పొత్తులో భాగంగా ఎంఎన్‌సీ వర్గం దక్షిణ ముంబయి, శిరిడీ లోక్‌సభ సీట్లను డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పరస్పర అవసరాలే కలిపాయా..

2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి మహారాష్ట్రలో పోటీ చేసింది. నాడు మొత్తం 48 సీట్లలో 41 సాధించింది. కొన్ని నెలల తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈ కూటమి విజయం సాధించింది. అధికారం పంచుకొనే విషయంలో ఇరు పక్షాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో శివసేన ఎన్డీఏను వీడి మహా వికాస్‌ అఘాడీ(కాంగ్రెస్‌-ఎన్సీపీ)తో జట్టుకట్టింది. కొంతకాలం ప్రభుత్వం సజావుగా సాగినా.. 2022లో శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గం తిరుగుబాటు ప్రకటించింది. వీరు భాజపాతో చేతులు కలిపారు. దీంతో రాష్ట్రంలో అధికారం ఎన్డీఏ వశమైంది. ఆ తర్వాత పార్టీ, గుర్తును ఉద్ధవ్‌ వర్గం కోల్పోయింది. ఈ సమయంలో రాజ్‌, శిందే వర్గానికి మద్దతుగా నిలిచారు. ఉద్ధవ్‌ కారణంగానే  పార్టీ చీలిపోయిందని ఆరోపించారు. ఇక మరోవైపు ఎన్సీపీలో కూడా అజిత్‌ పవార్‌ నేతృత్వంలో తిరుగుబాటు చోటు చేసుకొంది. అత్యధిక మంది ఎన్‌డీఏతో జట్టుకట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్‌ వర్గానికి సానుభూతి లభిస్తే ప్రతికూలంగా మారుతుందని భాజపా అంచనావేస్తోంది. పెద్ద రాష్ట్రం కావడంతో ఏ మాత్రం రిస్క్‌ చేయడానికి ఇష్టపడటంలేదు. ఠాక్రే కుటుంబంలోని మరో ప్రజాకర్షక నేత రాజ్‌ను తమ పక్షాన చేర్చుకొనేందుకు పావులు కదిపింది. 

బాల్‌ ఠాక్రేకు స్వయాన సోదరుడి కుమారుడే రాజ్‌. ఆయన ఉద్ధవ్‌తో విభేదాల కారణంగా 2006లో శివసేన నుంచి బయటకు వెళ్లిపోయారు. 2009లో అతడి నేతృత్వంలోని ఎంఎన్‌సీ 13 ఎమ్మెల్యే స్థానాలను సాధించింది. కానీ, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఆ పార్టీ తిరిగి బలపడాలంటే ఓ పెద్ద అండ అవసరం. భాజపా రూపంలో అది లభిస్తుందని రాజ్‌ ఆశిస్తున్నారు. సీట్ల పంపిణీ ఓ కొలిక్కి వచ్చి ఎన్డీఏలో చేరితే ఎంఎన్‌సీకి పుంజుకోవడానికి అవకాశం లభించినట్లే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని