Naveen Patnaik: మోదీజీ.. పరామర్శించాల్సింది పోయి.. నిందలు వేస్తారా?: నవీన్‌ పట్నాయక్‌

ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని, అలాంటి వ్యక్తి తనపై నిందలు వేయడం దురదృష్టకరమని ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు.

Published : 31 May 2024 00:19 IST

భువనేశ్వర్‌: ప్రధాని మోదీ (PM Modi) తనకు మంచి స్నేహితుడని, అలాంటి వ్యక్తి తనపై నిందలు వేయడం దురదృష్టకరమని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్ (Naveen Patnaik) ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తల వెనక కుట్ర దాగి ఉందని ఆయన వ్యాఖ్యానించడంపై నవీన్‌ స్పందించారు. ఓట్ల కోసమే ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడుతున్నానని ఆరోపించడం సరికాదన్నారు. స్నేహితుడి ఆరోగ్యం బాగోలేదని తెలిసినప్పుడు.. ఫోన్‌ చేసి పరామర్శించాల్సింది పోయి ఇలా నిందలు వేస్తారనుకోలేదన్నారు. 

ఎన్నికల ప్రచారంలో (Odisha Elections) భాగంగా బుధవారం ఒడిశాలోని బారిపదాలో పర్యటించిన మోదీ.. సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తోన్న వార్తల వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? అని అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే.. సీఎం ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను తేల్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటుచేస్తామని వ్యాఖ్యానించారు. ఒడిశా ముఖ్యమంత్రి కదలికలను కూడా సీఎం సన్నిహితుడు పాండియన్‌ నియంత్రిస్తున్నాడంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించిన మరుసటిరోజే ప్రధాని ఈవిధంగా స్పందించారు.

తమిళనాడుకు చెందిన పాండియన్‌.. పంజాబ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఒడిశా మహిళను వివాహం చేసుకున్న ఆయన.. అక్కడికే మకాం మార్చాడు. అందుకే ఆయన్ను బయట వ్యక్తి అని పేర్కొంటూ భాజపా ప్రచారం చేస్తోంది. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలతోపాటు, ఆరు లోక్‌సభ స్థానాలకు జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని