LS Polls: ప్రతిపక్షాలను జైలుకు పంపడమే ‘మోదీ గ్యారంటీ’: మమతా బెనర్జీ

లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టడమే ‘మోదీ గ్యారంటీ’’ అని మమతా బెనర్జీ విమర్శించారు.

Published : 08 Apr 2024 17:29 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి విమర్శలు గుప్పించారు. జూన్‌ 4వ తేదీ తర్వాత అవినీతి నేతలపై కఠిన చర్యలు తీసుకుంటానని మోదీ చెప్పడమంటే.. ప్రతిపక్ష నేతలను జైల్లో పెడతారనే అర్థమని చెప్పారు. ఇదే ‘మోదీ గ్యారంటీ’ అని మండిపడ్డారు. బాంకుడాలో నిర్వహించిన ప్రచార సభలో దీదీ ఈమేరకు మాట్లాడారు. స్థానిక పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు తూర్పు మేదినీపుర్‌ జిల్లాలోని భూపతినగర్‌కు వెళ్లినట్లు ఆరోపించారు.

‘‘ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌కు వస్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి సమస్య లేదు. కానీ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత అవినీతి విషయంలో ప్రతిపక్షాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్న తీరు ఆమోదయోగ్యం కాదు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడతారా? ఎన్నికల తర్వాత భాజపా నేతలను జైల్లో పెడతానని నేను చెబితే ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదు. కాబట్టి, ఆ మాట అనడం లేదు. జూన్ 4 తర్వాత ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టడమే ‘మోదీ గ్యారంటీ’’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

‘సీనియర్ల అడుగు జాడల్లో నడిచానని చెప్పి’.. ప్రధాని మోదీపై పవార్‌ విసుర్లు

బెంగాల్‌లోని జల్‌పాయీగుడిలో ఆదివారం నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మేం అవినీతిని రూపుమాపేందుకు యత్నిస్తున్నాం. ప్రతిపక్షాలు మాత్రం అవినీతిపరులను కాపాడాలని చెబుతున్నాయి. జూన్‌ 4 తర్వాత వారిపై మరిన్ని చర్యలు తీసుకుంటాం’’ అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు.. రెండేళ్ల క్రితం నాటి ఓ పేలుడు కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోల్‌కతాకు తరలిస్తున్న ఎన్‌ఐఏ అధికారుల వాహనంపై ఇటీవల భూపతినగర్‌లో స్థానికులు రాళ్ల దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఆత్మరక్షణ చర్యగా సీఎం మమతా సమర్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని