Sharad Pawar: ‘సీనియర్ల అడుగు జాడల్లో నడిచానని చెప్పి’.. ప్రధాని మోదీపై పవార్‌ విసుర్లు

రాజకీయాల్లో సీనియర్ల అడుగుజాడల్లో నడిచానని గతంలో చెప్పిన మోదీ.. ఇప్పుడు భిన్నమైన వైఖరిని అవలంబిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Published : 08 Apr 2024 15:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సీనియర్ల అడుగుజాడల్లో నడిచానని గతంలో చెప్పిన మోదీ.. ఇప్పుడు భిన్నమైన వైఖరిని అవలంబిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన పవార్‌ (Sharad Pawar).. భిన్న భావజాలాలు కలిగిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారంటూ ప్రధానిపై విమర్శలు గుప్పించారు.

‘‘నేను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నారు. అప్పుడు ఆ రాష్ట్రానికి ఎంతో సాయం చేశా. ఆయన ఏ పార్టీకి చెందినవారనే విషయాన్ని చూడలేదు. అక్కడి రైతులు సంతోషంగా ఉండాలనే భావించా. అందుకే ఆయనకు సాయం చేశా. ఒకరోజు బారామతికి రావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అలా వచ్చిన మోదీ ఓ సభలో ప్రసంగిస్తూ.. ‘పవార్‌ సాహెబ్‌ నా చేయి పట్టుకొని.. నేను ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని కొనసాగించాలని బోధించారు’ అని చెప్పారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన భిన్నమైన వైఖరిని అవలంబిస్తున్నారు’’ అని 2016 నాటి విషయాలను గుర్తుచేస్తూ ప్రధాని మోదీపై శరద్‌ పవార్‌ విమర్శలు గుప్పించారు.

ఇలాగైతే ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో వేస్తారు? సుప్రీం ఆగ్రహం

ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కేసులను ప్రస్తావించిన పవార్‌.. ‘ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శలు చేసినా లేదా భిన్నంగా మాట్లాడినా.. ఇక వారు జైలుకే. ఇది ప్రజాస్వామ్యమా? కాదు, నియంతృత్వం. అధికారం ఒక్కరి చేతుల్లోకి వెళ్తే భ్రష్టు పట్టిపోతుంది, ఎక్కువమంది చేతిలో ఉంటేనే అది దారి తప్పదు’ అని అన్నారు. ఎన్‌సీపీని చీల్చి భాజపాతో చేతులు కలిపిన అజిత్‌ పవార్‌పై మాట్లాడిన ఆయన.. అది తీవ్రమైన నిర్ణయమని, అందుకు ఎవరు ప్రేరేపించారని ప్రశ్నించారు. బారామతి ఎంపీ అభ్యర్థిగా ఉన్న సుప్రియా సూలే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, పార్లమెంటులో ఆమె వినిపించే గళమే చాలన్నారు. ఇదిలాఉంటే, మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలకు గాను ఏప్రిల్‌ 19 నుంచి మే 20 వరకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని