Modi: రేపే మోదీ పట్టాభిషేకం

ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు.

Updated : 08 Jun 2024 07:25 IST

వరసగా మూడోసారి ప్రధాని పీఠంపైకి..
రాష్ట్రపతి నుంచి నియామక లేఖ

రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు తీర్మానం ప్రతిని అందజేస్తున్న జేడీయూ
అధ్యక్షుడు నీతీశ్‌కుమార్, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు,
భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. చిత్రంలో అనుప్రియా పటేల్,
పవన్‌కల్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌శిందే, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌ షా, అజిత్‌పవార్‌

ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తిచేశారు. అట్టహాసంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈనెల 5న ఎన్డీయే పార్టీల నేతలు కలిసి నరేంద్రమోదీని తమ నాయకుడిగా ప్రకటించగా శుక్రవారం కూటమి ఎంపీలంతా సమావేశమై ముక్తకంఠంతో ఆమోదముద్ర వేశారు. పార్లమెంటు పాత భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో సుమారు రెండున్నర గంటలపాటు ఎన్డీయే పక్షాల అధినేతలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఎంపీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తర్వాత ఎన్డీయే నేతలు ఆ ప్రతిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆ మేరకు ప్రధానమంత్రిని రాష్ట్రపతి ఆహ్వానించి ప్రభుత్వాన్ని, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపే లేఖను అందించారు. ఈ విషయాన్ని మోదీ రాష్ట్రపతి భవన్‌ వద్ద మీడియాకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

18కి చాలా ప్రాధాన్యం: మోదీ 

‘‘18వ లోక్‌సభ ఏర్పాటవుతోంది. మనిషి జీవితంలోనూ 18కి చాలా ప్రాధాన్యం ఉంది. టీనేజ్‌ పూర్తిచేసుకొనే వయసు ఇది. ఒకరకంగా ఇది కొత్తశక్తిని ఇస్తోంది. స్వాతంత్య్ర అమృతోత్సవం ముగిసిన వెంటనే జరిగిన తొలి ఎన్నిక ఇది. 2047కల్లా దేశం స్వాతంత్య్ర శత వసంతోత్సవాలు జరుపుకొనేనాటికి మనం కన్న కలలన్నీ నెరవేర్చుకోవడానికి పునాదివేసే లోక్‌సభ ఇదే. మూడోసారి దేశానికి సేవ చేయడానికి ప్రజలు అవకాశమిచ్చారు. ఇందుకు ప్రజలకు ధన్యవాదాలు. గత రెండు పర్యాయాల్లో వేగంగా దేశం వేసిన ముందడుగు, సమాజంలోని ప్రతి విభాగంలో కనిపిస్తున్న స్పష్టమైన మార్పు ప్రతి భారతీయుడికి గర్వకారణం. 18వ లోక్‌సభ పదవీకాలంలోనూ మేం అదే వేగంతో, అంకితభావంతో దేశ ఆకాంక్షలు పూర్తిచేయడానికి పనిచేస్తాం. 

అట్టహాసంగా నాయకుడి ఎంపిక

ఎన్డీయే పక్షాల నేతగా నరేంద్ర మోదీని ఎంపిక చేసే కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కూటమి ఎంపీలు, ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమక్షంలో కరతాళ ధ్వనుల మధ్య మోదీ ఎన్నిక పూర్తయింది. ఉదయం సెంట్రల్‌హాల్‌లోకి మోదీ వచ్చిన వెంటనే భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. వేదికపై మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అగ్రనేత నీతీశ్‌కుమార్‌లు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. నడ్డా స్వాగతోపన్యాసం చేస్తూ మోదీని కూటమి నేతగా ఎన్నుకోవడాన్ని చరిత్రాత్మక క్షణంగా అభివర్ణించారు. దీనికి సాక్షులుగా నిలవడాన్ని అదృష్టంగా అభివర్ణించారు. ఎన్డీయే కూటమి నేతగా మోదీ పేరును ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్‌సింగ్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. 1962 తర్వాత ఏ నాయకుడూ మూడోసారి వరుసగా ప్రధానమంత్రి కాలేదని చెప్పారు. ఎన్డీయే ఎంపీలంతా లేచి మోదీ...మోదీ... అని నినదిస్తూ తమ సమ్మతి తెలిపారు. అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్, నీతీశ్‌కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌పవార్, చిరాగ్‌ పాస్వాన్, జితిన్‌రామ్‌ మాంఝీ, హెచ్‌డీ కుమారస్వామి, అనుప్రియా పటేల్‌ తదితరులు బలపరిచారు.


అనుభవం వచ్చింది.. పరుగులు తీయిస్తా

2014లో నాకు ఈ పదవి కొత్త. ఇప్పుడు అనుభవం వచ్చింది. అందువల్ల ఇప్పుడు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడం సులభంగా మారింది. ఈ పదేళ్ల కాలంలో భారత్‌ విశ్వబంధుగా అవతరించింది. దాని ఫలితాలు ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఈ అయిదేళ్లలో ప్రపంచ పరిస్థితులు మనకు మేలు చేయబోతున్నాయి. సుస్థిర ప్రభుత్వం ఏర్పడటంవల్ల భారత్‌ వృద్ధి మరింత వేగం పుంజుకోనుంది. దీనివల్ల ప్రతి రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు’’ అని మోదీ చెప్పారు.


మోదీ నాయకత్వం మా అదృష్టం 

నరేంద్రమోదీకి ప్రధానమంత్రిగా నియామక పత్రాన్ని అందజేస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము 

కేవలం మోదీవల్లే వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీయే అధికారం చేపట్టబోతోందని కూటమి నాయకులంతా శ్లాఘించారు. ఆయన నాయకత్వంలో పనిచేయడాన్ని అదృష్టంగా అభివర్ణించారు. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత చంద్రబాబు, నడ్డా సహా అన్నిపక్షాల నేతలు మోదీకి గజమాలవేసి సత్కరించారు. ఆ తర్వాత ఆయన ఎంపీలను ఉద్దేశించి గంటన్నరపాటు ప్రసంగం చేశారు. మోదీని చంద్రబాబు శాలువాతో సత్కరించడంతోపాటు తిరుమల శ్రీవారి ప్రసాదం అందించారు. పవన్‌కల్యాణ్‌తో కలిసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించి అంతా శుభం కలగాలని ఆకాంక్షించారు. సమావేశానంతరం చంద్రబాబు, నీతీశ్‌కుమార్‌ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పించారు. ప్రధాన భాగస్వామ్య పక్షాలకు కొత్త కేబినెట్‌లో ముందుగా కనీసం ఒక్కో బెర్తు కేటాయిస్తారని సమాచారం.  

ఎన్డీయే లోక్‌సభాపక్ష నేతగా ఎన్నికైన నరేంద్రమోదీకి దహీ-చీనీతో నోరు తీపిచేస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని