MLC Elections: ఎమ్మెల్సీ టికెట్ల రేసులో 300 మందికి పైగా ఆశావహులు.. హస్తినకు సిద్ధరామయ్య, డీకేఎస్‌!

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అధికార కాంగ్రెస్‌కు తలనొప్పి వ్యవహారంలాగే ఉంది. మొత్తం 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 300 మందికి పైగా ఆశావహులు ఉన్నట్లు కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ అన్నారు.

Published : 28 May 2024 17:34 IST

బెంగళూరు: కర్ణాటకలో శాసనమండలి ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తోంది. విధాన పరిషత్‌లో ఖాళీ అవుతున్న 11 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా..  కాంగ్రెస్‌ నుంచి 300 మందికి పైగా నేతలు టికెట్లు ఆశిస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. టికెట్ల కేటాయింపులో పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరోవైపు, ఈ వ్యవహారంపై చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య, శివకుమార్‌లు హస్తినకు పయనమయ్యారు.

జూన్‌ 4 తర్వాత ఆయన మాజీ సీఎం: అమిత్ షా వ్యాఖ్యలు

దిల్లీకి బయల్దేరే ముందు డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ నుంచి 300 మందికి పైగా నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. వీరిలో అన్నివర్గాల వారూ ఉన్నారు. ఏడు సీట్లలో అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు. వీరిలో సిట్టింగ్ సభ్యులు సైతం ఉన్నారు. అందరూ పార్టీ కోసం పనిచేసేవాళ్లే. కొందరు బ్లాక్‌ స్థాయిలో పనిచేస్తే.. ఇంకొందరు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో పనిచేసే నేతలు ఉన్నారు. అందువల్ల అభ్యర్థుల ఎంపిక మాకు కష్టంగానే ఉంటుంది. అధిష్ఠానమే దీనిపై నిర్ణయం తీసుకుంటుంది’’ అని చెప్పారు. మరోవైపు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తనలాంటి సీనియర్లతోనూ చర్చించాల్సిందంటూ హోంమంత్రి జి.పరమేశ్వర చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డీఎకేఎస్‌.. ‘కచ్చితంగా.. వారిని కూడా సంప్రదిస్తాం’ అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ కోటాలో మండలికి ఎన్నికైన 11 మంది సభ్యుల పదవీకాలం జూన్‌ 17తో ముగియనుంది. జూన్‌ 13న పోలింగ్‌ జరగనుండటంతో.. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జూన్‌ 4న నామినేషన్ల పరిశీలన, 6న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. జూన్‌ 13న పోలింగ్ నిర్వహించి అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఆయా పార్టీల బలాబలాలను బట్టి చూస్తే.. ఏడు స్థానాల్లో కాంగ్రెస్, మూడు భాజపా, ఒకటి జేడీఎస్‌ దక్కించుకొనే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని