Lok Sabha Polls: ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!

కాంగ్రెస్‌  నేత, ఛింద్వాడా సిట్టింగ్‌ ఎంపీ నకుల్‌ నాథ్‌ ఇటీవల నామినేషన్‌ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. 

Published : 29 Mar 2024 00:16 IST

భోపాల్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తనయుడు నకుల్‌ నాథ్‌ లోక్‌సభ ఎన్నికలకు ఇటీవల నామినేషన్‌ దాఖలు చేశారు.  ఛింద్వాడా నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన ఆయన ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తుల విలువ దాదాపు  రూ.700 కోట్లు ఉంటుందని ప్రకటించిన ఆయన.. తనకు సొంత వాహనాలు లేవని పేర్కొనడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది.

నకుల్‌నాథ్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. గత ఐదేళ్ల కాలంలో తన ఆస్తులు దాదాపు రూ.40 కోట్లు పెరిగినట్లు పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తాను రూ.7.89 కోట్లు, తన భార్య రూ.4.39 కోట్లు మేర ఆర్జించామని పేర్కొన్నారు. తన వద్ద ఉన్న నగదు, షేర్లు, బాండ్లు వంటి చరాస్తుల విలువ రూ.641 కోట్లు కాగా, రూ.48.07 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఆయన తెలిపారు. తన చేతిలో రూ.44.97 లక్షల నగదు, తన భార్య వద్ద రూ.43,866 ఉన్నట్లు పేర్కొన్నారు.  తన తండ్రి కమల్‌నాథ్‌కు రూ.12లక్షలు లోన్‌ ఇచ్చినట్లు నకుల్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వద్ద 147.58 క్యారెట్‌ డైమండ్లు, స్టోన్స్‌తో పాటు 1896 గ్రాముల గోల్డ్‌ బార్‌లు, నగలు, 7.630 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపిన ఆయన.. వీటి విలువ దాదాపు రూ.2.2కోట్లు ఉంటుందన్నారు. అలాగే, తన సతీమణి ప్రియ వద్ద 881.31 క్యారెట్‌ డైమండ్లు, స్టోన్లు ఉన్నట్లు నకుల్‌ తెలిపారు. వీటి విలువ రూ.2.75 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. 

నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్‌ సతీమణి ఆరోపణలు

మరోవైపు, గత లోక్‌సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనకు రూ.660 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు నకుల్‌ పేర్కొన్నారని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఛింద్వాడా సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న నకుల్‌ నాథ్‌ 2019లో లోక్‌సభలో మొత్తం 475మంది కోటీశ్వరుల జాబితాలో చోటుదక్కించుకున్నారని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఛింద్వాడా తొలి నుంచీ కాంగ్రెస్‌కు కంచుకోట. 1952 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసారి మినహా అన్నిసార్లు కాంగ్రెస్‌ జెండానే ఎగిరింది. ఇక్కడి నుంచి కమల్‌నాథ్ రికార్డు స్థాయిలో తొమ్మిది సార్లు లోక్‌సభకు ఎన్నిక కావడం విశేషం. గత ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా 29 సీట్లకు గాను 28 చోట్ల విజయం సాధించినప్పటికీ ఛింద్వాడాను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని