Nara Lokesh: ఏపీ విద్యార్థులు ప్రాణ భయంతో ఉన్నారు.. తక్షణమే తీసుకురండి: నారా లోకేశ్‌

మణిపుర్‌లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో అక్కడి ఎన్‌ఐటీలో చదువుతున్న ఏపీ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Updated : 07 May 2023 14:10 IST

అమరావతి: మణిపుర్‌లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో అక్కడి ఎన్‌ఐటీలో చదువుతున్న ఏపీ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆ విద్యార్థులను తక్షణమే రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

మణిపుర్‌లో తలెత్తిన ఘర్షణల‌తో అక్కడ అత్యవ‌స‌ర ప‌రిస్థితి విధించారని.. ఇప్పటికే ప‌ర‌స్పర దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారని లోకేశ్‌ అన్నారు. చాలా జిల్లాల్లో కర్ఫ్యూ అమలవుతోందని చెప్పారు. వివిధ యూనివ‌ర్సిటీలు, ఎన్ఐటీల్లో వంద‌లాది మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నారని.. భ‌ద్రత విష‌య‌మై ఆందోళ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో వారిని త‌క్షణ‌మే రాష్ట్రానికి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని లోకేశ్‌ డిమాండ్ చేశారు. 

తెలంగాణ విద్యార్థులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సురక్షితంగా తీసుకొచ్చిందని.. ఏపీ విద్యార్థులు మాత్రం బిక్కుబిక్కుమంటూ మణిపుర్‌లో ప్రాణభయంతో గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు, ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్లని విద్యార్థులు ఎలా సంప్రదించగలరని లోకేశ్ ప్రశ్నించారు. కాల్‌ సెంటర్ల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని.. మణిపుర్‌ ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర విద్యార్థులను రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. 

అక్రమ కేసులపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థులను కాపాడటంపై లేదా?: అచ్చెన్న

మణిపుర్‌లోని తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థులను కాపాడటంపై లేదా? అని మండిపడ్డారు. రంగులు వేయడం, ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ఆపదలో ఉన్న విద్యార్థులను ఆదుకోదా? అని అచ్చెన్న నిలదీశారు. ప్రత్యేక విమానాల్లో తిరిగే సీఎం.. మణిపుర్‌లో తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఒక విమానం కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వెంటనే వారిని స్వస్థలాలకు తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని