Nara Lokesh: జగన్‌ ఐదేళ్ల పాలనలో ప్రజలకు నరకం: నారా లోకేశ్‌

ఏ సీఎం అయినా తమ పరిపాలనను అభివృద్ధి కార్యక్రమంతో ప్రారంభిస్తారని.. కానీ జగన్ మాత్రం విధ్వంసంతో మొదలుపెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 20 Mar 2024 10:52 IST

అమరావతి: ఏ సీఎం అయినా తమ పరిపాలనను అభివృద్ధి కార్యక్రమంతో ప్రారంభిస్తారని.. కానీ జగన్ మాత్రం విధ్వంసంతో మొదలుపెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. తాడేపల్లిలోని అపర్ణ అపార్టుమెంట్‌ వాసులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్‌ పాలనలో ప్రజలు ఐదేళ్లు నరకం అనుభవించారన్నారు. కుప్పం నియోజకవర్గంతో పోటీపడేలా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయిని రాష్ట్రమంతా విస్తరించిన ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి జగన్ తన పక్కన పెట్టుకున్నారని.. దీన్నిబట్టి ఆయన ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న గంజాయిని తాము అధికారంలోకి రాగానే కూకటి వేళ్లతో పెకిలించేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను పరిపాలన, అభివృద్ధిలోనూ భాగస్వాములు చేస్తామని లోకేశ్‌ తెలిపారు.

జగన్‌ సైన్యానికి, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులు

జగన్ పార్టీకి పోయేకాలం దగ్గర పడుతున్న కొద్దీ రక్త దాహం మరింత పెరిగిపోయిందని నారా లోకేశ్‌ ఎక్స్(ట్విటర్‌) వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఓటమి భయంతో తెదేపా కార్యకర్త మునయ్యను వైకాపా  సైకోలు మట్టుబెట్టారు. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన ఆయన్ను తెదేపాలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారు. బాబాయ్‌పై అబ్బాయి గొడ్డలి వేటేసి అధికారం దక్కించుకున్నాడు. ఆ అధికారం పోతుందనే భయంతో తెలుగుదేశం జెండా పట్టిన కార్యకర్తలపై గొడ్డలి ఎత్తుతున్నారు. జగన్‌కు, ఆయన సైకో సైన్యానికి, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులు. మునయ్య కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది. నిందితులకు శిక్ష పడేలా చేస్తాం.’ అని లోకేశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని