Modi: సమష్టిగానే నిర్ణయాలు

కేంద్రంలో మరోసారి కొలువుదీరబోతున్న ఎన్డీయే సర్కారు అన్ని నిర్ణయాలనూ సమష్టిగా తీసుకుంటుందని, అదే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు.

Updated : 08 Jun 2024 07:42 IST

కలసికట్టుగా ముందుకెళ్తాం
ఎన్డీయే అత్యంత బలమైన కూటమి
100 సీట్లయినా కాంగ్రెస్‌కు రాలేదు 
దక్షిణాదిలోనూ కమలానికి ఆదరణ 
ఎన్డీయే పక్షాల ఎంపీలు, నేతల సమావేశంలో మోదీ

దిల్లీ: కేంద్రంలో మరోసారి కొలువుదీరబోతున్న ఎన్డీయే సర్కారు అన్ని నిర్ణయాలనూ సమష్టిగా తీసుకుంటుందని, అదే తమ లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఏకాభిప్రాయం కోసం తాను పాటుపడతానని, అధికారాన్ని పొందడానికి కాకుండా ‘దేశమే ముందు’ అనే సూత్రానికి కట్టుబడిన సహజసిద్ధ కూటమి తమదని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరమని, దేశాన్ని నడపించడానికి మాత్రం ఏకాభిప్రాయం ఉండాలని అన్నారు. అన్ని మతాలనూ సమానంగా చూడాలనేది తమ సిద్ధాంతమని వివరించారు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో- కూటమి లోక్‌సభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆయన.. భాగస్వామ్య పక్షాల నేతలు, నూతన ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బకొట్టేందుకు విపక్షం ప్రయత్నిస్తోందని, ఎన్డీయే కూటమే విజయం సాధించినా దానిని ఓటమిగా చూపాలనుకుంటోందని ఆయన విమర్శించారు.

భాగస్వామ్య పక్షాలు, గణాంకాల పరంగా ఏవిధంగా చూసినా ఎన్డీయే అత్యంత బలమైన కూటమి అని పేర్కొన్నారు. మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సర్కారు ఎలా ఉండబోతోంది, తన దార్శనికత ఏమిటనేది వివరించారు. భాజపా లోక్‌సభాపక్ష నేతగా, భాజపా పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆయన ఎన్నికయ్యారు. సమావేశం తర్వాత నేతలంతా రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ లేఖ సమర్పించారు. దానిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్రపతి.. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం మోదీ ప్రమాణం చేస్తారు.

ఫలితాల తర్వాత నోరు మూసేశారు

ఈవీఎంల విశ్వసనీయతను, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినవారు ఈవీఎంలకు శవయాత్ర నిర్వహిస్తారని తాను భావించానని, ఈ నెల నాలుగో తేదీ తర్వాత వారంతా నోరు మూశారని, ఇదే ప్రజాస్వామ్య బలమని మోదీ అన్నారు. ఈవీఎంలు, ఈసీపై అనుమానాలు వ్యక్తంచేసినవారు ఒకవేళ ఎన్నికల ఫలితాలు తమకు తగ్గట్టు రాకపోతే దేశమంతటా మంటలు రేకెత్తించాలని చూశారని ఆరోపించారు. ఇకనైనా కనీసం ఐదేళ్లపాటు ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తబోరని ఆశిస్తున్నట్లు చెప్పారు. యూపీఐ, ఆధార్‌ వంటి సాంకేతిక పురోగతిని ప్రశ్నించినప్పుడే ఇండియా కూటమివారు మునుపటి శతాబ్దానికి చెందిన వారని అర్థమైందని ఎద్దేవా చేశారు. రాబోయే పదేళ్లలో సుపరిపాలన, అభివృద్ధి, నాణ్యమైన జీవితం అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు. ‘‘కాంగ్రెస్‌ చాలా వేగంగా పతనమవుతోంది. పదేళ్ల తర్వాత కూడా ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. కాంగ్రెస్‌ హయాంలో వారి సొంత ప్రధానినే అవమానించారు. గత మూడు ఎన్నికల్లో వారికొచ్చిన స్థానాలు.. ఈ ఒక్క ఎన్నికల్లో మేం సాధించిన సీట్ల కంటే తక్కువే. ఈసారి 100 స్థానాల మార్కునైనా ఆ పార్టీ చేరుకోలేదు’’ అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. తమ పదేళ్ల పాలన కేవలం ట్రైలర్‌ మాత్రమేనన్నారు.

బాబుతో చరిత్రాత్మక విజయం సాధించాం

‘‘దక్షిణాది ప్రజలు ఎన్డీయేను ఆదరించారు. అక్కడ సరికొత్త రాజకీయాల పునాదిని మనం బలోపేతం చేసుకున్నాం. ఏపీ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలను అద్దం పట్టింది. తమిళనాడులో సీట్లు గెలవలేకపోయినా ఓట్లు పెరిగాయి. మనకు భవిష్యత్తు ఉందనే స్పష్టమైన సందేశాన్ని అవి చాటాయి. కేరళలో విజయావకాశాలు లేకపోయినా మన కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. అక్కడ చాలామంది బలిదానాలు చేశారు. వారి సంఖ్య జమ్మూ-కశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయినవారికంటే ఎక్కువ. తొలిసారి అక్కడి నుంచి మన ప్రతినిధి (సురేశ్‌ గోపి) లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. గత 30 ఏళ్లలో దేశాన్ని మూడుసార్లు ఐదేళ్లు చొప్పున ఎన్డీయే పాలించింది. మరోసారి ఐదేళ్ల పాలనకు ప్రజలకు అవకాశమిచ్చారు. ఎన్డీయే అంటేనే సుపరిపాలన. పేదల సంక్షేమమే మనందరి ప్రథమ కర్తవ్యం. దేశ అభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాం. వికసిత్‌ భారత్‌ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతాం. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయవంతం కాలేదు’’ అని మోదీ అన్నారు. 

నా సంతకంతోనూ క్యాబినెట్‌ జాబితా ప్రచారం చేస్తారు 

మంత్రి పదవులు, శాఖల కేటాయింపు గురించి వ్యాప్తిలో ఉన్న వదంతులను విశ్వసించవద్దని ప్రధాని కోరారు. తన సంతకంతోనూ ఒక జాబితాను బయటకు తెచ్చేలా సాంకేతికత అందుబాటులో ఉందన్నారు. ఇలాంటి వదంతులను ‘ఇండి’ కూటమి కూడా వ్యాప్తిచేసే అవకాశం ఉందన్నారు. మంత్రి పదవులను ఇస్తామని ఎరవేసి కూడా ఎంపీలను కొంతమంది సంప్రదించే అవకాశం ఉందని, ఫోన్‌కాల్స్‌ వస్తే అవి ఎవరినుంచో ధ్రువీకరించుకోవాలని సూచించారు. భేటీలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లతో పాటు కూటమి పక్షాల నేతలు నీతీశ్‌కుమార్, ఏక్‌నాథ్‌ శిందే, చిరాగ్‌ పాస్వాన్, హెచ్‌.డి.కుమారస్వామి, అజిత్‌ పవార్, అనుప్రియా పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. భాజపా, తెదేపా, జేడీయూ, శివసేన, లోక్‌జన్‌శక్తి (రాంవిలాస్‌), ఎన్‌సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్‌ ఎంపీలు, ఎన్డీయే పార్టీల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు.

ప్రతి క్షణం రాజ్యాంగ పరిరక్షణకే  

రాజ్యాంగంలో పొందుపరిచిన పవిత్ర విలువల పరిరక్షణకే తన జీవితంలో ప్రతి క్షణం అంకితమైందని మోదీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. పార్లమెంటులో రాజ్యాంగానికి తాను తలవంచి నమస్కరిస్తున్న ఫొటోను దీనికి జతచేశారు. పేద కుటుంబంలో జన్మించినా దేశానికి సేవచేసే భాగ్యం తనలాంటివారికి దక్కిందంటే దానికి రాజ్యాంగమే కారణమని అన్నారు. ఎన్డీయే తనపై ఉంచిన విశ్వాసాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానని, ఎంపీలకు, భాగస్వాములకు రుణపడి ఉంటానని చెప్పారు.


ఎన్డీయే అంటే...

ఎన్డీయేకు తనదైన శైలిలో మోదీ వివరణ ఇచ్చారు. ఎన్డీయే అంటే న్యూ (సరికొత్త), డెవలప్డ్‌ (అభివృద్ధి చెందిన), యాస్పిరేషనల్‌ (ఆకాంక్షిత) భారతదేశమని పేర్కొన్నారు. పొత్తులు కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే అని ఇప్పటికే విపక్ష ఇండియా కూటమి పార్టీలు చెబుతున్నాయని, అది వారి స్వభావానికి, అధికార దాహానికి నిదర్శనమని చెప్పారు. ‘మనం ఓడిపోయామని వారు అంటున్నారు. ఎక్కడ ఓడిపోయాం?.. మనం నిన్న ఉన్నాం, ఈ రోజు ఉన్నాం, రేపూ ఉంటాం. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఎన్డీయేది ఘనమైన విజయమని ప్రపంచం గుర్తించింది. ఇండియా కూటమి క్రమేపీ మునిగిపోతూ అగాథంలోకి జారిపోతోంది. మన విజయం కోసం పోరాడిన లక్షలమంది కార్యకర్తలకు వందనం’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని