Bhupathiraju Srinivasa Varma: బీజేపీ వర్మ: సామాన్య కార్యకర్త To కేంద్ర మంత్రిగా..

Bhupathiraju Srinivasa Varma: పార్టీ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Published : 10 Jun 2024 00:05 IST

BJP Varma | ఇంటర్నెట్ డెస్క్‌: నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భూపతి రాజు శ్రీనివాస వర్మగా (Bhupathiraju Srinivasa Varma) కంటే.. బీజేపీ వర్మగా ఆయన ప్రసిద్ధి. అంతగా పార్టీ పేరునే తన పేరుగా మార్చుకున్నారాయన. 34 ఏళ్లుగా పార్టీ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడ్డారాయన. ఆ విధేయతతోనే పార్టీ టికెట్‌ దక్కించుకున్నారు. ప్రజా క్షేత్రంలో భారీ విజయాన్ని అందుకున్నారు. తొలి విజయంలోనే మోదీ కేబినెట్‌లో సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు.

చాలాకాలం నుంచి భాజపాలో ఉండటంతో ఆయన బీజేపీ వర్మగా స్థానికంగా గుర్తింపు పొందారు. 1967 ఆగస్టు 4న భూపతిరాజు సూర్యనారాయణరాజు, సీత దంపతులకు జన్మించారు. ఆయన భార్య వెంకటేశ్వరి దేవి. వర్మకు సంతానం లేదు. పీజీ వరకు చదువుకున్న ఆయన.. మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, డీఎన్‌ఆర్‌ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శిగా, కరస్పాండెంట్‌గా, భూపతిరాజు బాపిరాజు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1980 దశకంలో వామపక్ష విద్యార్థి నాయకుడిగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌)లో పని చేశారు. విద్యార్థుల సమస్యలు, ఫీజు విధానాలు, విద్యా సంస్థల్లో సౌకర్యాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు. తర్వాత భాజపా విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. 1991-1997 మధ్య కాలంలో భాజపా భీమవరం పట్టణ, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా, నరసాపురం పార్లమెంట్‌ కన్వీనర్‌గా, జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2010-2018 మధ్య మరోసారి జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ఇన్‌ఛార్జ్జిగా, 2020-23 మధ్య రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అనూహ్యంగా వరించిన అదృష్టం 

నరసాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరు కూడా అనూహ్యంగానే తెరపైకి వచ్చింది. తొలుత భాజపా నుంచి రఘురామకృష్ణరాజు పేరు బలంగా వినిపించినా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వర్మ టికెట్‌ దక్కించుకున్నారు. తెదేపా, జనసేన మద్దతుతో అనూహ్య విజయం సాధించారు. వైకాపా అభ్యర్థి గూడూరి ఉమాబాలపై భూపతిరాజు శ్రీనివాస వర్మ 2,76,802 ఓట్ల ఆధిక్యం సాధించారు. గతంలో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి 1999, 2014లలో తెదేపా మిత్రపక్షం తరఫున బరిలో నిలిచిన భాజపా అభ్యర్థులు యూవీ కృష్ణంరాజు, గోకరాజు గంగరాజు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు తెదేపా, జనసేన మద్దతుతో భాజపా అభ్యర్థి అయిన వర్మను విజయం వరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని