NDA vs INDIA bloc: ఎన్డీయే vs ఇండియా కూటమి.. ఏ పార్టీ ఎవరితో..?

NDA vs INDIA bloc: సార్వత్రిక సమరంలో ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు పోటీ చేశాయి. ఇంతకీ ఏ పార్టీ ఏ కూటమిలో ఉంది? 

Updated : 03 Jun 2024 17:02 IST

NDA vs INDIA bloc | ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీర్ఘంగా సాగిన లోక్‌సభ ఎన్నికలు.. తుది ఘట్టానికి చేరాయి. ఏడు దశల్లో పోలింగ్‌ జరగ్గా.. రేపటితో (జూన్‌ 4న) విజేతలెవరో తేలిపోనుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్‌ (Exit polls) కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అంచనాలు వెలువరించాయి. ఈ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలో ఎన్డీయే కూటమి (NDA) ఒకవైపు.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్ వంటి విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా (INDIA bloc) ఏర్పడి తలపడ్డాయి. ఇంతకీ ఈ కూటముల్లో ఏ పార్టీలున్నాయి? ఏ కూటమిలోనూ చేరని పార్టీలేవి?

ఎన్డీయే కూటమి..

‘ఆబ్‌కీ బార్‌ 400 పార్‌’ అంటూ ఎన్నికల నినాదంతో భారతీయ జనతా పార్టీ (BJP) ఈ సారి ఎన్నికల కదన రంగంలోకి దూకింది. అందుకోసం చిన్న చిన్న పార్టీలను కూడా తన ఎన్డీయే కూటమిలో కలుపుకొంది. ఒంటరిగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కశ్మీర్‌లోని మూడు స్థానాలకు మినహా దేశవ్యాప్తంగా 540 సీట్లలో పోటీ చేసింది. ప్రస్తుత లోక్‌సభలో ఎన్డీయే పార్టీల బలం 336 సీట్లుగా ఉంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు గాను 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భాజపా మిత్రులతో కలిసి బరిలో నిలిచింది. మిగిలిన చోట్ల ఒంటరిగా పోటీ చేసింది.

భాజపా తర్వాత తెదేపానే..

ఎన్డీయే కూటమిలో భాజపానే అతిపెద్ద పార్టీ. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ 441 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీనే (TDP) రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. మొత్తం 17 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుండడం గమనార్హం. ఇవి కాకుండా జేడీయూ (16), ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన (15), తమిళనాడులోని అన్బుమణి రాందాస్‌ నేతృత్వంలోని పట్టలి మక్కల్ కట్చి (10), లోక్‌జనశక్తి పార్టీ (5), అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (5) ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. దేవెగౌడకు చెందిన జేడీఎస్‌ (3), జనసేన (2), అప్నాదళ్‌ (సోనేలాల్‌) (2), అసోం గణపరిషత్‌ (2), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (2), రాష్ట్రీయ లోక్‌దళ్‌ (2) వంటి పార్టీలు ఉన్నాయి. ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌, హిందుస్థానీ అవామీ మోర్చా, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌, నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌ మోర్చా, రాష్ట్రీయ సమాజ్‌ పక్ష, సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ, యునైటెడ్‌ పీపుల్స్‌ లిబరల్‌ ఒక్కో స్థానం నుంచి పోటీ చేశాయి. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం భాజపా మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఇండియా కూటమి..

మోదీ సర్కారును ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఏకమైన కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో (Congress) యూపీఏ కూటమి ఉండగా.. ఈసారి మరిన్ని పార్టీలతో ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి ఏర్పాటులో నీతీశ్‌ కుమార్‌ కీలకంగా వ్యవహరించారు. చివరి నిమిషంలో ఆయన ఎన్డీయే గూటికి చేరడం గమనార్హం. ఇండియా కూటమిలో చిన్న చిన్న విభేదాలు తలెత్తినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు చేసుకుంది. పొత్తులు కుదరని చోట ఆయా పార్టీలు ఒంటరిగా బరిలో నిలిచాయి.

కాంగ్రెస్‌ తొలిసారి తక్కువ స్థానాల్లో..

మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేసింది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌ (80), మహారాష్ట్ర (48), బిహార్‌ (40), తమిళనాడుల్లో (39) మొత్తం 207 స్థానాలు ఉండగా.. వాటిలో కాంగ్రెస్‌ కేవలం 52 చోట్ల పోటీ చేసింది. అంటే కేవలం 25 శాతం స్థానాలకు పరిమితమైంది. ఆయా రాష్ట్రాల్లో మిత్రపక్ష పార్టీలకు మెజారిటీ సీట్లు కేటాయించింది. ఇండియా కూటమిలో సమాజ్‌ వాదీ పార్టీ (62), రాష్ట్రీయ జనతా దళ్‌ (24), డీఎంకే (22), శివసేన (21), శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (10) ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. వీటితో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, వికాశ్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీతో పాటు మరికొన్ని చిన్న చిన్న పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి.

కూటమిలోనే పోటాపోటీ..

ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కొన్ని చోట్ల కొలిక్కి రాకపోవడం, స్థానిక పరిస్థితుల వల్ల కూటమిలో పార్టీలే ప్రధాన ప్రత్యర్థులుగా బరిలోకి నిలిచాయి. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో దిగాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా.. ఇక్కడ కాంగ్రెస్‌, సీపీఎం కలిసి పోటీ చేశాయి. దిల్లీలో పొత్తులో భాగంగా పోటీ చేసిన ఆప్‌, కాంగ్రెస్‌ పంజాబ్‌లో మాత్రం విడిగా పోటీ చేశాయి.

కూటమి కట్టని పార్టీలు

రెండు ప్రధాన కూటముల మధ్యే పోటీ అయినప్పటికీ.. ఏ కూటమిలోనూ చేరని పార్టీలూ కూడా కొన్ని ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భారత రాష్ట్ర సమితి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేశాయి. బీఎస్పీ, అన్నాడీఎంకే, బిజూ జనతా దళ్‌, శిరోమణి అకాలీదళ్‌, ఎంఐఎం వంటి పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. హరియాణాలోని జన నాయక్‌ జనతా పార్టీ ఎన్డీయేను చివరి నిమిషంలో వీడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని