Lok Sabha Election Results 2024: ‘ఇండియా’ మెరిపించినా.. ఎన్డీయేకే పీఠం

కాంగ్రెస్‌ భయపెట్టినా.. సమాజ్‌వాదీ గట్టి సవాల్‌ విసిరినా.. తృణమూల్‌ సత్తా చాటినా.. డీఎంకే దీటుగా ఎదురు నిలబడినా..  ఐదేళ్ల కిందటి స్థాయిలో కాకున్నా.. అఖండ మెజారిటీ రాకున్నా.. కమలం మళ్లీ గెలిచింది!

Updated : 05 Jun 2024 07:17 IST

240 సీట్లు గెల్చుకున్న భాజపా
ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ
మ్యాజిక్‌ మార్కును దాటిన ఎన్డీయే కూటమి
కేంద్రంలో మూడోసారి సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధం
తెలుగుదేశం, జేడీయూలతో కలిసొచ్చిన పొత్తు
మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ!
97 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ జయభేరి.. మరో 2 చోట్ల ఆధిక్యంలో.. 
ఉత్తర్‌ప్రదేశ్‌లో 37 స్థానాలతో సమాజ్‌వాదీ హవా
బెంగాల్‌లో తృణమూల్‌కే జైకొట్టిన ఓటర్లు
తమిళనాట సీట్లన్నీ ‘ఇండియా’ ఖాతాలోకే..
మధ్యప్రదేశ్‌లో కమలం క్లీన్‌స్వీప్‌
అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో పరాజయం

లోక్‌సభ ఫలితాల అనంతరం దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన పార్టీ శ్రేణులకు
విజయకేతనం చూపుతున్న ప్రధాని మోదీ. పక్కన పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరులు

కమలం మళ్లీ గెలిచింది!! 

కాంగ్రెస్‌ భయపెట్టినా.. సమాజ్‌వాదీ గట్టి సవాల్‌ విసిరినా.. తృణమూల్‌ సత్తా చాటినా.. డీఎంకే దీటుగా ఎదురు నిలబడినా.. ఐదేళ్ల కిందటి స్థాయిలో కాకున్నా.. అఖండ మెజారిటీ రాకున్నా.. కమలం మళ్లీ గెలిచింది! ఆంధ్ర నాట అపూర్వ విజయం దక్కించుకున్న తెలుగుదేశం అండతో.. బిహార్‌లో భుజం కలిపిన జేడీయూ మద్దతుతో.. శివసేన (శిందే) సహకారంతో.. ఎల్‌జేపీ (రాంవిలాస్‌) చేయూతతో.. కమలం మళ్లీ సాధించింది!

విపక్ష ఇండియా కూటమి కలలను కల్లలుగా మారుస్తూ.. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని ఎన్డీయే ముద్దాడింది. మరో ఐదేళ్లపాటు దేశాన్ని పాలించేందుకు సిద్ధమైంది. ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడో దఫా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా లాంఛనమే! అయితే- ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించలేకపోయినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష కూటమి చూపిన పోరాట పటిమ నిస్సందేహంగా ప్రశంసార్హమే! అధికారం దక్కినా.. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో ఓడిపోవడం, సొంతంగా మ్యాజిక్‌ మార్కును అందుకోలేకపోవడం భాజపాకు నిరాశ కలిగించే అంశాలే!!

‘చార్‌ సౌ పార్‌’ నినాదంతో భాజపా జోరు మీదుంది.. ఆ పార్టీ అఖండ విజయం ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ముక్తకంఠంతో జోస్యం చెప్పాయి.. ఇలాంటి పరిస్థితుల్లో- మంగళవారం ఉదయం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంలో భాజపాదే స్పష్టమైన పైచేయి! ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు తగ్గట్టే ఆ పార్టీ సొంతంగా 300 మార్కును దాటడం ఇక లాంఛనమే అనిపించింది!! ‘ఇండియా’కు దాదాపుగా రెట్టింపు స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కనిపించారు. కానీ ఒక్కో రౌండ్‌ గడిచేకొద్దీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మధ్యాహ్నానికల్లా ఎన్డీయే వైపు తగ్గుతూ.. ‘ఇండియా’ వైపు సీట్లు పెరిగాయి. పోరు రసవత్తరంగా మారింది. ఫలితంపై ఉత్కంఠ అంతకంతకూ పెరిగింది. ముఖ్యంగా తనకు కంచుకోటల్లాంటి ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హరియాణాల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బలు తగలడం సర్వత్రా ఆసక్తి పెంచింది. అనూహ్య ఫలితమేమైనా రాబోతోందా అన్న ప్రశ్న కోట్లమంది మదిలో మొదలైన క్షణాలవి. అయితే మధ్యప్రదేశ్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంతోపాటు గుజరాత్‌లో పాతిక స్థానాలు దక్కడంతో కమలనాథులు ఊపిరి పీల్చుకున్నారు! హిందీ బెల్ట్‌లో అనూహ్యంగా తగ్గిన స్థానాల సంఖ్యను.. ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మెరుగైన ఫలితాలతో కొంతమేరకు పూడ్చుకోగలిగారు. ఫలితంగా భాజపా 240 స్థానాలతో అధికార పీఠానికి చేరువకాగలిగింది. దాని మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన (శిందే వర్గం)ల అండతో ఎన్డీయే మరో దఫా పాలనా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

దిల్లీ: యావత్‌ భారతావనిని ఉత్కంఠతో ఊపేసిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భాజపాదే పైచేయి అయింది.  240 స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. ఇండియా కూటమి 231 నియోజకవర్గాల్లో గెలిచి, 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. దేశంలోకెల్లా ఏకైక అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ మార్కు (272)ను మాత్రం అది అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో భాజపా కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు తన మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ), శివసేన (శిందే వర్గం) వంటి పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తవడం, ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో భాజపా ఉత్సాహంగా ఈ ఎన్నికల బరిలో దిగింది. 400 స్థానాలను గెల్చుకోవడమే లక్ష్యమంటూ ‘చార్‌ సౌ పార్‌’ నినాదమిచ్చింది. అయితే ఆ మార్కుకు చాలా దూరంలో నిలిచిపోయింది. మోదీ రాజకీయాల్లోకి వచ్చాక.. అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం ఇదే తొలిసారి. భాజపా సొంతంగా 2019లో 303, 2014లో 282 సీట్లు గెల్చుకుంది. 

మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో హవా.. యూపీ, రాజస్థాన్‌లలో బోల్తా 

ఎప్పట్లాగే మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో భాజపా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసిన పార్టీ.. గుజరాత్‌లో 25 చోట్ల జయభేరి మోగించింది. ఒడిశాలో ఏకంగా 20 స్థానాలను తన ఖాతాలో వేసుకొని ఔరా అనిపించింది. బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన జేడీయూ 12 సీట్లతో సత్తాచాటింది. అక్కడ భాజపా కూడా డజను స్థానాలు దక్కించుకుంది. దిల్లీలోని ఏడు స్థానాలూ కమలం ఖాతాలోకే వెళ్లాయి. హిమాచల్‌ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌ కూడా ఆ పార్టీకే జైకొట్టాయి. అయితే దేశంలోకెల్లా అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో, తనకు పట్టున్న రాజస్థాన్‌లో కమలదళానికి తీవ్ర నిరాశ ఎదురైంది. 2019లో 62 సీట్లు గెల్చుకున్న యూపీలో ఈసారి సమాజ్‌వాదీ పార్టీ (37) కంటే వెనకబడి 33 స్థానాలకు పరిమితమైంది. రాజస్థాన్‌లో మొత్తం 25 సీట్లు ఉండగా.. కేవలం 14 చోట్ల గెలిచింది. హరియాణాలోని పది సీట్లను ఐదేళ్ల కిందట క్లీన్‌స్వీప్‌ చేసిన పార్టీ.. ఈసారి సగం స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలో ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం), శివసేన (శిందే వర్గం)లతో జట్టు కట్టిన భాజపాకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. మోదీ వారణాసిలో హ్యాట్రిక్‌ విజయం సాధించారు. అయితే 2019 నాటి(4.79 లక్షలు)తో పోలిస్తే ఈసారి ఆయన చాలా తక్కువగా 1.52 లక్షల ఓట్ల ఆధిక్యంతో సరిపెట్టుకున్నారు. 

దక్షిణ భారత్‌లో ఈసారి గణనీయ ఫలితాలు సాధిస్తామంటూ ముందునుంచీ బలంగా చెప్పిన భాజపా నిరాశకు గురికాక తప్పలేదు. తమిళనాట ఆ పార్టీ బోణీ కూడా కొట్టలేకపోయింది. అక్కడి 39 సీట్లూ ‘ఇండియా’ ఖాతాలోకే వెళ్లాయి. అందులో డీఎంకే వాటా 22 కాగా, కాంగ్రెస్‌ వాటా 9. దక్షిణాదిలో తనకు మంచి పట్టున్న రాష్ట్రమైన కర్ణాటకలో 28 స్థానాలకుగాను కేవలం 17 సీట్లలోనే విజయం సాధించింది. కాంగ్రెస్, వామపక్షాలకు కంచుకోటలాంటి కేరళలో బోణీ కొట్టడం కమలదళానికి కాస్త ఊరటనిచ్చే విషయం. 


కాంగ్రెస్‌కు పునరుజ్జీవం

రాయ్‌బరేలీ, వయనాడ్‌ స్థానాల నుంచి గెలుపొందిన అనంతరం దిల్లీలో సోనియాగాంధీ,
మల్లికార్జున్‌ ఖర్గే, ప్రియాంకాగాంధీలతో కలిసి విజయకేతనం చూపుతున్న రాహుల్‌గాంధీ

గత రెండు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించలేకపోయిన కాంగ్రెస్‌ ఈసారి స్ఫూర్తిదాయక ఫలితాలు సాధించింది. కడపటి వార్తలందే సమయానికి 97 స్థానాల్లో గెలిచి, మరో 2 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హస్తం పార్టీ కేరళలో 14 సీట్లతో సత్తాచాటింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణాల్లో మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తాను పోటీ చేసిన రెండుచోట్లా విజయం సాధించారు. వయనాడ్‌లో 3.64 లక్షలు, రాయ్‌బరేలీలో 3.90 లక్షల ఓట్ల ఆధిక్యం దక్కించుకున్నారు. సార్వత్రిక సమరంలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) పెద్దగా ప్రభావం చూపలేదు. పంజాబ్‌లో 3 సీట్లు గెల్చుకున్న ఆ పార్టీ.. దిల్లీలో ఖాతా తెరవలేకపోయింది.


బెంగాల్‌లో దీదీ దూకుడు 

ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ ఒకటి. అక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ కంటే భాజపా ఎక్కువ సీట్లు సాధిస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారయ్యాయి. రాష్ట్రంపై తన పట్టును మరింత పదిలం చేసుకుంటూ తృణమూల్‌ 29 సీట్లు గెల్చుకుంది. కమలనాథులు 12 స్థానాలకే పరిమితమయ్యారు. మొత్తంగా ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీల పునరుత్థానాన్ని గట్టిగా చాటిచెప్పాయి.


ఎన్డీయే ప్రభుత్వంపై వరుసగా మూడోసారి విశ్వాసం ఉంచుతూ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఓటరు దేవుళ్లు చూపించిన ఈ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు గత దశాబ్దకాలంగా చేస్తోన్న మంచి పనులన్నింటినీ ఇకపైనా కొనసాగిస్తానని హామీ ఇస్తున్నా. ఎన్డీయే విజయం కోసం శ్రమించిన కార్యకర్తలకు అభినందనలు. వారి అవిరళ కృషిని మాటల్లో వివరించలేను.

ప్రధాని మోదీ


రాజ్యాంగ పరిరక్షణ కోసం అతిపెద్ద తొలి అడుగు పడింది. పేదలు, అణగారిన వర్గాలవారే ఇందులో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం తెదేపా, జేడీయూ వంటి మాజీ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై‘ఇండియా’ కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం.

రాహుల్‌ గాంధీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని