Nitin Gadkari: నా వారసులుగా రాజకీయాల్లో రావాలంటే.. కుమారులకు గడ్కరీ కీలక సూచన

రాజకీయాల్లో తన వారసత్వాన్ని కొనసాగించాలంటే ముందుగా కింది స్థాయిలో పనిచేయాలని కుమారులకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు.

Updated : 24 Mar 2024 15:51 IST

నాగ్‌పుర్‌: సార్వత్రిక ఎన్నికల్లో (LokSabha Elections 2024) ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పుర్‌ (Nagpur)లో భాజపా (BJP) నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజకీయ వారసత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తన కుమారులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముందుగా కిందిస్థాయిలో పనిచేయాలని సూచించారు.

‘‘ఈ సారి ఎన్నికల్లో నేను ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం ఉంది. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. దేశం కోసం నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీ మద్దతు వల్లే సాధ్యమయ్యాయి. నాగ్‌పుర్‌ను, ఇక్కడి ప్రజలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా వారసత్వాన్ని భాజపా కార్యకర్త ఎవరైనా కొనసాగించొచ్చు. వాళ్లకు ఆ హక్కు ఉంది. నా కుమారులెవరూ రాజకీయాల్లో లేరు. ఒకవేళ వాళ్లు రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ముందు కింది స్థాయిలో పోస్టర్లు అంటించాలి. పార్టీ బలోపేతం కోసం కార్యకర్త చేసే పనులన్నీ చేసి సామర్థ్యాన్ని నిరూపించుకుని నా వారసత్వాన్ని అందుకోవాలి’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. 

కేంద్ర రవాణా, రహదారి శాఖ మంత్రిగా గత పదేళ్లలో నాగ్‌పుర్‌లో రూ.లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక నాగ్‌పుర్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల స్థాయికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో భాజపా, శివసేన (ఏక్‌నాథ్‌ శిందే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) పార్టీలు కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు ఐదు విడతల్లో పోలింగ్ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని