Fadnavis: ‘ఇది పవార్‌ల మధ్య పోటీ కాదు.. మోదీ- రాహుల్‌ గాంధీల పోరు’

బారామతిలో జరుగుతోంది శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ల మధ్య పోరు కాదని.. ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీల మధ్య సంగ్రామమని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ వ్యాఖ్యానించారు.

Published : 06 Apr 2024 00:05 IST

పుణె: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ మహారాష్ట్రలోని బారామతి (Baramati) స్థానం వార్తల్లో నిలుస్తోంది. శరద్‌ పవార్‌ (Sharad Pawar) కుమార్తె సుప్రియా సూలేపై అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్ర పోటీ చేయడమే దీనికి కారణం. అయితే.. ఇది శరద్‌, అజిత్‌ల మధ్య పోరు కాదని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ల మధ్య సంగ్రామమని అని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) వ్యాఖ్యానించారు.

‘‘బారామతి పోరు.. శరద్ పవార్, అజిత్ పవార్‌ల మధ్య జరుగుతోందని కొంతమంది భావిస్తున్నారు. మరికొందరు దీన్ని సుప్రియ, సునేత్రల మధ్య పోటీగా చూస్తున్నారు. అయితే.. ఇవి రెండూ కాదు. ఇది ప్రధాని మోదీ, రాహుల్ గాంధీల మధ్య ఎన్నికల సంగ్రామం’’ అని స్థానికంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఫడణవీస్‌ అన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ రద్దు వంటి చరిత్రాత్మక నిర్ణయాలను సుప్రియ వ్యతిరేకించారని గుర్తుచేశారు.

శరద్‌పవార్‌ను రాజకీయంగా అంతం చేసేందుకే.. ‘కుటుంబ పోరు’పై సుప్రియా సూలే

‘‘పార్లమెంటులో సూలే చేసిన ప్రసంగాలను గమనించండి. ఈ నేపథ్యంలో మోదీ నిర్దేశించిన అభివృద్ధి పథంలో పయనించే ఎంపీని ఎన్నుకోవాలా? లేదా పురోగతిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉన్న రాహుల్ గాంధీ సిద్ధాంతం ప్రకారం నడిచే అభ్యర్థిని గెలిపించాలా? అనేది ఓటర్లే నిర్ణయించుకోవాలి’’ అని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రతిపక్షం సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉందని.. ఓటర్లు మాత్రం అసలైన లక్ష్యంపైనే దృష్టి సారించాలని కోరారు.

శరద్‌ పవార్‌ కుటుంబానికి పట్టున్న స్థానం బారామతి. 2009 నుంచి సూలే ఇక్కడ ఎంపీగా ఉన్నారు. మరోవైపు.. అజిత్‌ 1991 నుంచి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు సోదరి విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రస్తుతం కుమార్తె తరఫున శరద్‌ పవార్‌ సైతం రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా మే 7న ఈ స్థానానికి పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు