BJD: బీజేడీకి షాక్‌.. ఆరుసార్లు ఎన్నికైన ఎంపీ రాజీనామా!

ఆరుసార్లు ఎంపీ, బీజేడీ (BJD) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన భర్తృహరి మహతాబ్‌ శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. 

Published : 23 Mar 2024 00:04 IST

భువనేశ్వర్: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ఒడిశా (Odisha) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన, అధికార బీజేడీ (BJD) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన భర్తృహరి మహతాబ్‌ (Bhartruhari Mahtab) ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేడీ అధ్యక్షుడు, సీఎం నవీన్‌ పట్నాయక్‌కు ఈ మేరకు లేఖను పంపినట్లు వెల్లడించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడికి సంబంధించి 13 ఏళ్ల నాటి కేసులో కటక్‌లోని ప్రత్యేక కోర్టు ఆయనపై అభియోగాలు మోపిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.

‘‘13 ఏళ్ల తర్వాత నాపై అభియోగాలు మోపారు. ప్రభుత్వం తన సొంత ఎంపీపైనే ఛార్జిషీట్‌ రూపొందించింది. బీజేడీలో నేను సరిగ్గా పనిచేయలేకపోయాను. ఏదైనా ప్రకటన చేసినప్పుడల్లా.. పార్టీ దాన్ని పెద్దదిగా చేసి చూపెట్టింది. పార్టీ అభివృద్ధిపై నా సూచనలను లెక్కచేయలేదు. ఈ వైఖరి కారణంగానే గత ఒకటిన్నరేళ్లుగా మౌనంగా ఉన్నాను. ఈ విషయాన్ని సీఎం పట్నాయక్‌ దృష్టికి తీసుకెళ్లినా.. ‘ఆలోచిద్దాం’ అని బదులిచ్చారు’’ అని మహతాబ్ తన లేఖలో పేర్కొన్నారు.

ఆయన సినిమాలపై నిషేధం విధించండి.. ‘ఈసీ’కి భాజపా లేఖ

మాజీ సీఎం హరేకృష్ణ మహతాబ్‌ కుమారుడైన భర్తృహరి.. 1998 నుంచి కటక్‌ ఎంపీగా వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. పార్లమెంటు చర్చల్లో అత్యుత్తమ పనితీరుతో.. 2017 నుంచి 2020 వరకు వరుసగా నాలుగేళ్లపాటు ‘సంసద్ రత్న’ అవార్డును అందుకున్నారు. భాజపాలో చేరనున్నారా? అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఈ విషయంలో తన మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కమలదళంలో చేరాలనుకుంటే స్వాగతిస్తామని భాజపా రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి విజయ్ పాల్ సింగ్ తోమర్ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు