PM Modi: ఆ 4 స్తంభాలపై భాజపా మేనిఫెస్టో: మోదీ

PM Modi: పదేళ్ల పాలనలో సాధించిన పురోగతి నేపథ్యంలో యావత్తు దేశం భాజపా మేనిఫెస్టో కోసం ఎదురుచూసిందని ప్రధాని మోదీ అన్నారు.

Updated : 14 Apr 2024 18:29 IST

దిల్లీ: కీలకమైన నాలుగు స్తంభాలపై భాజపా మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను తయారు చేశామని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. గరీబ్‌, యువశక్తి, అన్నదాత, నారీశక్తి (GYAN)ని దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారని చెప్పారు. దేశ యువత ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తుందన్నారు. అంబేడ్క్‌ర్‌ జయంతి రోజున మేనిఫెస్టోను (BJP manifesto) విడుదల చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. చైత్ర నవరాత్రులు కొనసాగుతున్న సమయంలో ఆవిష్కరించడం ఆశీర్వాదంగా భావిస్తున్నామన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సహా పార్టీ ప్రముఖులంతా ఆయనకు నివాళులర్పించారు.

భాజపా మేనిఫెస్టో (BJP manifesto) కోసం యావత్తు దేశం వేచిచూసిందని మోదీ అభివర్ణించారు. పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన పురోగతే అందుకు కారణమన్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని కమిటీ మేనిఫెస్టో కోసం చేసిన కృషిని అభినందించారు. దేశం నలుమూలల నుంచి సలహాలు, సూచనలు పంపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, అంకురాలకు మద్దతు, వివిధ రంగాల్లో గ్లోబల్‌ సెంటర్ల ఏర్పాటుపై ‘సంకల్ప పత్ర’లో దృష్టి సారించామన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు. వారందరూ మరింత ఉన్నతస్థితికి చేరేందుకు మద్దతు కొనసాగిస్తామన్నారు.

భాజపా మేనిఫెస్టో విడుదల.. కీలకాంశాలివే..

మోదీ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు: నడ్డా

ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలో దేశం పదేళ్లుగా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని భాజపా జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డా అన్నారు. వచ్చే ఐదేళ్లు కూడా దాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. అందరి సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ జయంతి రోజు మేనిఫెస్టోను విడుదల చేయడం సంతోషంగా ఉందని నడ్డా (JP Nadda) అన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన సూచించిన మార్గంలోనే తమ పార్టీ నడుస్తోందన్నారు. 2014లో అధికారంలోకి రాగానే భాజపా (BJP) సర్కార్‌ పేదల కోసమే పనిచేస్తుందని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఐదేళ్లు ఎలా పనిచేస్తామో తమ మేనిఫెస్టో చెబుతుందన్నారు.

మోదీ గ్యారంటీ 24 క్యారెట్ల బంగారం..

మోదీ హామీలను ప్రజలు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా భావిస్తున్నారని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) అభివర్ణించారు. అధికరణ 370 రద్దు, రామమందిర నిర్మాణం సహా పదేళ్లలో అనేక అభివృద్ధి పథకాలు చేపట్టామన్నారు. రాజ్‌నాథ్‌ నేతృత్వంలోని కమిటీయే మేనిఫెస్టోను రూపొందించిన విషయం తెలిసిందే. మొత్తం 15 లక్షల సూచనలు అందాయని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని