Pawan Kalyan: రైతులపై కేసులు పెడితే తీవ్ర పరిణామాలు: పవన్‌ కల్యాణ్‌ హెచ్చరిక

తిరుగుబాటు ఉంటే తప్ప రైతులను వైకాపా ప్రభుత్వం పట్టించునే పరిస్థితి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు.

Updated : 11 May 2023 15:21 IST

రాజమహేంద్రవరం: తిరుగుబాటు ఉంటే తప్ప రైతులను వైకాపా ప్రభుత్వం పట్టించునే పరిస్థితి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. జనసేన పర్యటన ఉందనగానే రాత్రికి రాత్రే ధాన్యం కోసం సంచులు ఇచ్చారని.. ముందే ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో రైతులతో పవన్‌ ముఖాముఖి నిర్వహించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో పవన్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల ఇళ్లలో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయన్నారు. ధాన్యం కొన్నవారి ఖాతాల్లో సకాలంలో డబ్బులు వేయడం లేదని ఆరోపించారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ నివేదికలను సీఎం జగన్‌ పరిశీలించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం ఇద్దామని వెళ్లినా కారణం లేకుండానే రైతులను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతుందని చెప్పారు. తమకు సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే రైతులపై కేసులు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పవన్‌ హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని