Pawan kalyan: అధికారం కోసమైతే నేను ఇంతలా కష్టపడాల్సిన పనిలేదు: పవన్‌ కల్యాణ్‌

ఆరో రోజు వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ఏటిమొగ్గలో ఆయన పర్యటించారు.

Updated : 19 Jun 2023 20:17 IST

కాకినాడ: ఆరో రోజు వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ఏటిమొగ్గలో ఆయన సోమవారం పర్యటించారు. ప్రత్యేక బోటులో ఉప్పుటేరు మీదుగా వెళ్లి స్థానిక జాలరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాలరులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. చేపల వేట విరామం వేళ ప్రభుత్వ జీవన భృతి అందడం లేదని వాపోయారు. చమురు పరిశ్రమల వల్ల నష్టపోతున్నామని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

జాలరులతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఎంతో నిబద్ధతతో జనసేన పార్టీని ప్రారంభించా. అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే ఇంత కష్టపడాల్సిన పనిలేదు. నాకు ఉన్న సామర్థ్యానికి ఏదో పదవి పొందొచ్చు. ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. ఈ సీఎంలాగా అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదు. బటన్ నొక్కితే డబ్బులు పడతాయని కూడా చెప్పను. ఉప కులాల మధ్య ఐక్యత ఉండాలి. సరైన వ్యక్తులను మీరు నమ్మడం లేదు. బతికే హక్కు అందరికీ ఉంది. దానికి భంగం కలిగినప్పుడు పోరాడాల్సిందే. మీ విశ్వాసం సరైన వ్యక్తులపై పెట్టడం లేదు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించండని అభ్యర్థిస్తున్నా.

రాష్ట్రంలోని ఇసుకంతా పెద్దిరెడ్డికి చెందిన మూడు కంపెనీలకే వెళ్లిపోతోంది. ఆ ఇసుక విలువ ఎంత లేదన్నా.. రూ. 10వేల కోట్లు ఉంటుంది. అది అంతా ఒక్కరి వద్దకే వెళ్తోంది. మీరు నాకు అండగా ఉంటే మీ సమస్యలను కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. మీ బాధలు వారికి వినిపిస్తా. మీ ఆరోగ్యం, ఉపాధి కోసం సంపూర్ణంగా కృషి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు మీ కష్టం, మీ రక్తం, శ్రమ ద్వారా రూ.వేల కోట్లు సమకూరుతోంది. మీ ఆదాయాన్ని ఇంకెవరో దోచేస్తున్నారు. మీరు నా కోసం నిలబడితే నేను మీ కోసం పోరాటం చేస్తా. నేను ఎవరితోనూ కుమ్మక్కవడం లేదు. నాకు ఎవరితోనూ కాంట్రాక్ట్‌లు లేవు. ఎలాంటి వ్యాపారాలూ లేవు. చమురు సంస్థలతో మాట్లాడతా. బీసీ కులాలపై అధ్యయనం చేసి వచ్చాను. మీరు మద్దతు ఇవ్వండి.. అండగా ఉంటా’’ అని జనసేనాని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని