Pawan Kalyan: ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలకు తిప్పలు: పవన్‌కల్యాణ్‌

అన్ని వర్గాలను జగన్‌ మోసం చేశారని, సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం ఇద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

Updated : 29 Feb 2024 00:49 IST

తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాలను జగన్‌ మోసం చేశారని, సిద్ధం అంటున్న ఆయనకు యుద్ధం ఇద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెదేపా - జనసేన ఉమ్మడి సభలో పవన్‌ మాట్లాడారు. ‘‘పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు. గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంటుంది.. మన విజయానికి స్ఫూర్తి జెండా.. అందుకే జెండా పేరుతో సభను ఏర్పాటు చేశాం’’ అని తెలిపారు.

గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే

‘‘పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నా. 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించింది. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసింది. జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్‌ కాదు. కార్యకర్తలారా వ్యూహం నాకు వదలండి.. నన్ను నమ్మండి. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే. అంకెలు లెక్కపట్టవద్దని విపక్షాలకు చెప్పండి. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నా.. కోట కూడా కడతాం. జగన్‌ తాడేపల్లి కోట కూడా బద్దలుకొడతాం. సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదు.. యుద్ధం చేసే వాళ్లు కావాలి

అప్పటి నుంచి జగన్‌ బతుకు నాకు తెలుసు

ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి. ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా ఈ ఐదుగురే పంచాయితీ చేస్తున్నారు. మిగతా ఏ నాయకులకు ఎలాంటి హక్కులు లేవు. సభా వేదికగా చెబుతున్నా.. వైకాపా గూండాలు తెదేపా-జనసేన నాయకులను, శ్రేణుల్ని ఇబ్బంది పెడితే.. మక్కెలు విరగొడతాం. తాను ఒక్కడినే అంటున్న జగన్‌.. మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారు. జూబ్లీహిల్స్‌ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టుకున్నప్పట్నుంచి జగన్‌ బతుకు నాకు తెలుసు.

కోట్లు సంపాదించే స్కిల్స్‌ ఉన్నా.. కాదనుకొని

జగన్‌.. ఇప్పటి వరకు నాలో శాంతినే చూశావు.. ఇప్పుడు యుద్ధం చూస్తావ్‌. 4 దశాబ్దాల రాజకీయ ఉద్ధండుడిని జైలులో పెడితే బాధ వేసింది. అందుకోసమే కూటమిని నేనే ప్రతిపాదించా. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం. నా నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు, రాష్ట్ర లబ్ధికోసమే ఉంటాయి. తెదేపా-జనసేన సహకరించుకుంటేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. కోట్లు సంపాదించే స్కిల్స్‌ ఉన్నా అన్నీ కాదనుకొని వచ్చా. సినిమాల్లో వచ్చే డబ్బును ఇంట్లో బియ్యం కొనకుండా.. హెలికాప్టర్లకు వెచ్చిస్తున్నా.

పవన్‌ అంటే జగన్‌ను అథఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం

ఏమీ చేయకున్నా జగన్‌ను పొగిడే సమూహం ఆయనకుంది. నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తోంది. నన్ను ప్రశ్నించే వాళ్లు నాతో నిలబడటం నేర్చుకోండి. నేను ఒక ప్రాంత వ్యక్తిని కాదు.. ఓడినా, గెలిచినా మీతో ఉంటా. కార్యకర్తలారా నా వ్యూహాలను తప్పుపట్టవద్దు. పవన్‌ అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, యువత కన్నీళ్లు తుడిచే చెయ్యి, జగన్‌ను అథఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం. ఒక్కడి ప్రతిఘటన కోట్ల మందికి తిరగబడే ధైర్యం ఇస్తుంది. ఈ సభావేదికగా యుద్ధానికి నేను శంఖారావం పూరిస్తున్నా. ఈ వైకాపా విధ్వంసకర పాలనను ఆపుదాం. ప్రజలకు బంగారు భవిష్యత్తును ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది. తెదేపా-జనసేన గెలవాలి.. జగన్‌ పోవాలి. ఈ కూటమి విజయం సాధించాలని, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నా’’అని పవన్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు