Rahul Gandhi: తెలంగాణపై మోదీ వ్యాఖ్యలు అవమానకరం: రాహుల్‌ గాంధీ

తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు. దీంతో భాజపా ఎంపీ బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

Published : 19 Sep 2023 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ (Telanagana) ఏర్పాటుపై ప్రధాని మోదీ (PM Modi) లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై మరోసారి దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను భారాస నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కూడా దీనిపై స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలు అవమానకరమని దుయ్యబ్టటారు. అయితే, రాహుల్‌ వ్యాఖ్యలకు భాజపా నేత, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) కౌంటర్‌ ఇచ్చారు.

‘‘తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడటం తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే’’ అని రాహుల్‌ తెలుగులో ట్వీట్ చేశారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని క్షమాపణ చెప్పాలంటూ #PMshouldApologisetoTelangana హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయి: కేటీఆర్‌

రాహుల్‌ జీ స్క్రిప్ట్‌ మారుస్తారా?: బండి కౌంటర్‌

అయితే రాహుల్‌ గాంధీ ట్వీట్‌కు బండి సంజయ్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ నేతపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 1400 మంది మరణాలకు కారణమైంది కాంగ్రెస్‌ కాదా? అని ప్రశ్నించారు. పెద్ద మనషుల ఒప్పందం పేరుతో తెలంగాణను ఆంధ్రాలో కలిపిందెవరంటూ నాటి ప్రధాని నెహ్రూను ఉద్దేశిస్తూ దుయ్యబట్టారు. 1969లోనూ కాంగ్రెస్‌ వల్ల 369 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఒక ఓటు - రెండు రాష్ట్రాలు అని భాజపా చెప్పాకే కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందని గుర్తుచేశారు. ‘‘మరి.. వేలాది మంది మరణాలకు కారణమైన మీరు, మీ కుటుంబం ఇంకెన్ని సార్లు క్షమాపణలు చెప్పాలి?రాహుల్‌ జీ ఇకనైనా స్క్రిప్ట్‌ మార్చండి’’ అంటూ ఎద్దేవా చేశారు.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తొలి రోజు (సోమవారం) లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను యూపీఏ సరిగా చేయలేదని, తెలంగాణ ఏర్పాటు ప్రజలను సంతృప్తి పర్చలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని