LS Polls: ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర: సోనియాగాంధీ

దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని సోనియాగాంధీ ఆరోపించారు.

Updated : 06 Apr 2024 18:18 IST

జైపుర్‌: దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నాశనం చేశారని కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు భాజపా (BJP)లో చేరేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. గత పదేళ్లలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలను పెంచి పోషించే విషయంలో ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

‘‘దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోంది. తనను తాను గొప్పగా భావించుకుంటున్న మోదీ.. దేశ గౌరవాన్ని మంటగలుపుతున్నారు. నియంతృత్వ పాలనకు సరైన జవాబు చెప్పాల్సిందే’’ అని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రధాని మోదీ ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. చైనా దురాక్రమణలపై స్పందించడం లేదని విమర్శించారు. రైతులకు ఏం చేశారో చెప్పాల్సినచోట ఆర్టికల్‌ 370 గురించి ప్రస్తావించారని.. రాజస్థాన్‌లోని చురూలో ప్రధాని ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఎద్దేవా చేశారు.

50 శాతానికి మించి రిజర్వేషన్లు

దేశ ప్రజలు న్యాయం కోరుతున్నారని.. అందుకే తమ మేనిఫెస్టోకు ‘న్యాయ పత్ర’ అని పేరు పెట్టినట్లు ప్రియాంకగాంధీ తెలిపారు. కేంద్రంలో పేదలు, రైతుల మాటలను పట్టించుకునేవారే కరవయ్యారని, ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. అంతకుముందు పార్టీ నేతలంతా కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు