PM Modi: నవీన్‌ పట్నాయక్‌ చుట్టూ అవినీతి కోటరీ

రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నా.. పేదరికంలో మగ్గుతూ, వలసలకు మారుపేరుగా నిలిచిన ఒడిశా విధ్వంసం తనను ఆవేదనకు గురిచేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. పాతికేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజూ జనతాదళ్‌ (బిజద) ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందన్నారు.

Updated : 21 May 2024 06:22 IST

ఒడిశా సభల్లో ప్రధాని మోదీ

కటక్, పూరీ : రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నా.. పేదరికంలో మగ్గుతూ, వలసలకు మారుపేరుగా నిలిచిన ఒడిశా విధ్వంసం తనను ఆవేదనకు గురిచేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. పాతికేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజూ జనతాదళ్‌ (బిజద) ప్రభుత్వానికి ప్రజలు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కార్యాలయం, ఇల్లు అవినీతి కోటరీ గుప్పెట్లో ఉన్నాయని.. రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి ఆ కోటరీయే కారణమని ధ్వజమెత్తారు. సోమవారం ఒడిశా ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడారు. ఒడిశాలోని బిజద ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ఢెంకానాల్, కటక్‌ సభల్లో ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాఫియాలను పెంచిపోషిస్తున్న బిజదలో ఒకప్పుడు చిన్న చిన్న కార్యకర్తలుగా ఉన్నవాళ్లు నేడు కోటీశ్వరులుగా ఎదిగారన్నారు. 2014లో వచ్చిన తమ ప్రభుత్వం రూపొందించిన కొత్త ఖనిజాన్వేషణ విధానం కింద ఒడిశాకు రూ.50,000 కోట్ల మినరల్‌ రాయల్టీ, డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) నుంచి మరో రూ.26,000 కోట్ల నిధులు అందాయన్నారు.  బిజద పాలనలో పూరీ జగన్నాథుడి ఆలయానికి కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. గత ఆరేళ్లుగా కనిపించని ఆలయ రత్న భాండాగారం తాళం చెవులు తమిళనాడు చేరినట్లుగా వినిపిస్తోందన్నారు.  

రథయాత్రను తలపించిన పూరీ రోడ్‌ షో

గోపాలపూర్‌ (ఒడిశా), న్యూస్‌టుడే: జై జగన్నాథ్, జై శ్రీరాం నినాదాలతో సోమవారం ఉదయం పూరీలోని బొడొదండొ మార్మోగింది. ప్రధాని మోదీ 8.15 నుంచి 9.30 వరకు నిర్వహించిన రోడ్‌ షో రథయాత్రను తలపించింది. దారి పొడవునా ఇరువైపులా బారికేడ్ల వద్ద నిల్చొని ప్రధానిని దగ్గరగా చూడాలని జనం ఎగబడ్డారు. రోడ్‌ షోలో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్‌ సామల్, పూరీ లోక్‌సభ అభ్యర్థి సంబిత్‌ పాత్ర, అసెంబ్లీ అభ్యర్థి జయంత సారంగి వెంట ఉన్నారు. జగన్నాథుని సన్నిధిలో తనకు లభించిన ఆదరణ తీపిగుర్తుగా మిగిలిపోతుందని మోదీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు