Chhattisgarh: కాంగ్రెస్‌ అధికారంలో వచ్చినప్పుడల్లా.. రెచ్చిపోతున్న నక్సలైట్లు: ప్రధాని మోదీ

దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా.. ఉగ్రవాదులు, నక్సలైట్లు ధైర్యంతో రెచ్చిపోతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.

Updated : 07 Nov 2023 15:24 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని (Naxalism) అరికట్టడంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం విఫలమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఉగ్రవాదులు, నక్సలైట్లు ధైర్యంగా రెచ్చిపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి సూరజ్‌పూర్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణాన్ని (Mahadev Betting App Scan) ప్రస్తావిస్తూ.. ఇక్కడి 30 శాతం కమీషన్ ప్రభుత్వం బహిరంగంగా బెట్టింగ్ నిర్వహిస్తోందంటూ ఆరోపణలు చేశారు.

‘దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా.. ఉగ్రవాదులు, నక్సలైట్లు ధైర్యంతో పెట్రేగిపోయారు. బాంబు పేలుళ్లు, హత్యల వార్తలు వినిపించేవి. కాంగ్రెస్‌ ఎక్కడ అధికారంలో ఉంటే.. అక్కడ నేరాలు, దోపిడీల పాలన సాగుతుంది’ అని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకున్న భాజపా నేతల హత్యలను ఉటంకిస్తూ.. స్థానికంగా నక్సల్స్ హింసాత్మక ఘటనలను కట్టడి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘మీరు బాంబులు, తుపాకుల నీడలో బతకాలనుకుంటున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఏం లాభం..?..’ అని ఓటర్లను ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ భద్రత చాలా ముఖ్యమని.. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను గద్దెదించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

డేట్‌, టైం చెప్పండి.. సోఫా ఫొటో షేర్‌ చేసి, అమిత్‌ షాకు బఘేల్‌ కౌంటర్‌

మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై సీఎం భూపేశ్‌ బఘేల్‌ను లక్ష్యంగా చేసుకున్న ప్రధాని మోదీ.. ఈ కుంభకోణం ఇప్పుడు దేశ విదేశాల్లో చర్చనీయాంశమైందన్నారు. రూ.500 కోట్లు లంచం ఇచ్చానని ఈ కేసులో ప్రధాన నిందితుడు మీడియాలో చెబుతున్నాడని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ దృష్టిలో దేశంలో ఆదివాసీల ఉనికే లేదని, వారిని ఆ పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆదివాసీల సంక్షేమం భాజపా ప్రాధాన్యమన్నారు. ఒక ఆదివాసీ మహిళ (ద్రౌపది ముర్ము) భారత రాష్ట్రపతి అవుతారని ఎవరైనా అనుకున్నారా? అని అడిగారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగానూ తొలి దశలో భాగంగా నేడు 20 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.

కాంగ్రెస్‌ నన్ను దూషించడం మర్చిపోదు: ప్రధాని మోదీ

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీ రోజూ తనను దూషించడం మరచిపోదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. దేశంలో మొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్‌ వ్యతిరేకించిందని ఆరోపించారు. కేవలం ఆదివాసీల ఓటు బ్యాంకుపైనే ఆ పార్టీకి పట్టింపు ఉందని, సంక్షేమంపై కాదని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. ముందస్తుగా ఆహ్వానం అందుకున్నప్పటికీ.. ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) హీరాలాల్‌ సమారియా ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని