BJP: భాజపాదే అధిక విజయశాతం..: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ.. ఎంపీలతో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

Updated : 07 Dec 2023 14:20 IST

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) విజయశాతం 56గా ఉంటే, కాంగ్రెస్‌ (Congress)ది 18 శాతం మాత్రమేనని ప్రధాని మోదీ వెల్లడించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. దిల్లీలో భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఎంపీలకు తెలియజేశారన్నారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించినట్లు చెప్పారు. 

సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ప్రధాని మోదీ ఆసక్తికర విషయాన్ని ఎంపీలతో పంచుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ 40 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం ఏడు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక భాజపా 39 సార్లు పోటీ చేస్తే.. 22 సార్లు గెలిచింది. ప్రాంతీయ పార్టీలు 36 సార్లు పోటీ చేసి 18 విజయాలు నమోదు చేశాయి.  కాంగ్రెస్‌ విజయశాతం 18 కాగా, భాజపాది 56, ప్రాంతీయ పార్టీలది 50 శాతం. ప్రజలు సుపరిపాలన కోసం భాజపా వైపు మొగ్గుచూపుతున్నారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం’’ అని మోదీ చెప్పినట్లు ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. 

ప్రధాని మోదీకి ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’.. ప్రత్యేక సన్మానం

ఈ సమావేశంలో పార్టీ ఎంపీలకు ప్రధాని కీలక సూచన చేశారు. భాజపా ఎంపీలంతా తప్పకుండా ‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’లో పాల్గొనాలని కోరారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం పార్టీ కార్యకర్తల సమష్టి కృషి ఫలితమని ప్రధాని మోదీ అన్నారు. దీనిని ఎవరి వ్యక్తిగత విజయంగా చెప్పడం సమంజసం కాదని, అందుకే మోదీ విజయమని చెప్పొద్దని ఎంపీలకు సూచించారు. దేశంలో భాజపా పాలన మెరుగ్గా ఉండటంతో మూడు రాష్ట్రాల్లో ప్రజలు పార్టీకి పట్టం కట్టారని, తెలంగాణ, మిజోరాంలో పార్టీ బలపడిందని ప్రధాని వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు