Modi: మహువా ప్రత్యర్థి రాజమాతకు మోదీ ఫోన్

భాజపా అభ్యర్థి రాజమాత అమృతారాయ్‌ (Amrita Roy)తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ (Modi).. దేశంలో అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 

Updated : 27 Mar 2024 15:05 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని కృష్ణానగర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి అమృతారాయ్‌ (Amrita Roy)కు ప్రధాని మోదీ (Modi) ఫోన్ చేసి మాట్లాడారు. అవినీతి నిర్మూలన అంశం వారి మధ్య చర్చకు వచ్చింది. బెంగాల్‌లో పేద ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము, దర్యాప్తు సంస్థలు అటాచ్‌ చేసిన ఆస్తుల్ని తిరిగి ఆ పేదలకే దక్కేలా కృషి చేస్తున్నామని ఆమెకు ప్రధాని వివరించారు. దేశంలో అవినీతిని రూపుమాపేందుకు భాజపా కట్టుబడి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు మార్పును ఎంచుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ (West Bengal)పై భారతీయ జనతా పార్టీ (BJP) గట్టిగా దృష్టిపెట్టింది. 42 స్థానాలున్న ఈ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే టీఎంసీ కీలక నేత మహువా మొయిత్రా (Mahua Moitra)కు పోటీగా స్థానిక రాజమాత (Rajamata)ను నిలబెట్టింది.

వరుణ్‌గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన అధీర్‌ రంజన్‌

దీంతో కృష్ణానగర్‌ పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్థానికంగా ఈ రాజ కుటుంబానికి ఉన్న ప్రాబల్యంతో విజయం సాధించాలని కాషాయ పార్టీ ఆశిస్తోంది. కృష్ణానగర్‌ స్థానంలో 2009 నుంచి టీఎంసీనే విజయం సాధిస్తోంది. 2019లో ఆ స్థానం నుంచి మహువా మొయిత్రా.. భాజపా అభ్యర్థిపై 60వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు రావడంతో గతేడాది ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. మోదీ మంగళవారం బశీర్హాట్‌ లోక్‌సభా స్థానం నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థిని రేఖా పాత్రాతో ఫోన్లో మాట్లాడారు. బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళల దురవస్థల గురించి ప్రముఖంగా ప్రస్తావించిన ఆమెను ‘శక్తి స్వరూపం’గా కొనియాడారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు షాజహాన్‌ షేక్‌, అతని అనుచరులు.. సందేశ్‌ఖాలీలో సాగించిన అకృత్యాలపై గళం వినిపించినందుకు ఆమెకు భాజపా ఈసారి ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చింది. బశీర్హాట్‌ స్థానం పరిధిలోనే ఈ గ్రామం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని