Pm modi: వికసిత భారత్‌ మాత్రమే కాదు.. వికసిత ఆంధ్రప్రదేశ్‌ మా లక్ష్యం: మోదీ

ఈసారి కేంద్రంలో 400+ సీట్లు రావాలని అందుకు ఆంధ్రా కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలని, అప్పుడే వికసిత భారత్‌తో పాటు, వికసిత ఆంధ్రప్రదేశ్‌ కూడా సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.  

Updated : 17 Mar 2024 20:48 IST

చిలకలూరిపేట: రాష్ట్రంలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ఏపీ మంత్రులు అవినీతి, అక్రమాల్లో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారన్నారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో బొప్పూడిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభకు ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగన్‌ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని.. వీటిని ఒకే కుటుంబం నడుపుతోందని విమర్శించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని కాంగ్రెస్‌ కుట్ర ..

‘‘ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు రెండు సంకల్పాలు తీసుకోవాలి. ఒకటి.. కేంద్రంలో ఎన్డీయే సర్కారును మూడోసారి స్థాపించటం, రెండోది.. రాష్ట్రంలో అవినీతి వైకాపా సర్కారుకు చరమగీతం పాడటం. ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడింది. దేశంతో పాటు, ఏపీ అభివృద్ధి కాంక్షించే వారంతా ముందుకొచ్చి ఎన్డీయేకు ఓటేయాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఎన్డీయేతోనే రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ పన్నాగాన్ని గుర్తించి ఎన్డీయేకు ఓటు వేయాలి’’

చంద్రబాబు, పవన్‌ పోరాటాన్ని గుర్తించాలి

‘‘కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం లభించినట్టు భావిస్తున్నా. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈసారి ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న రాబోతున్నాయి. అంటే ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లు వస్తాయని సూచనలా కనిపిస్తోంది. ప్రాంతీయ భావాలతోపాటు, జాతీయ భావాలను కలుపుకొని కూటమి ముందుకెళ్తుంది. ఇందులో భాగస్వాముల సంఖ్య పెరిగితే మరింత బలం పెరుగుతుంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి చేసిన కృషి, వారి పోరాటాన్ని గుర్తించాలి. ఏపీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలి. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యం’’

కాంగ్రెస్‌ను ఎన్టీఆర్‌ మట్టికరిపించారు..

‘‘ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతుంటాయి. కేరళలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ కూటమి పరస్పరం పోటీ పడతాయి. దిల్లీలో మాత్రం కలిసిపోతాయి. కాంగ్రెస్‌ ఇండియా కూటమి మిత్రులను వాడుకుని వదిలేస్తుంది. ఇండియా కూటమి అవసరాల కోసం ఏర్పాటైన స్వార్థపరుల బృందం. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెం విడుదల చేశాం. రాముడు, కృష్ణుడిని ఎన్టీఆర్‌.. తెలుగు సమాజంలో సజీవంగా ఉంచారు. ఆయన పోషించిన రాముడు, కృష్ణుడి పాత్రలు అజరామరం. తెలుగు వారికి కాంగ్రెస్‌ చేసిన అవమానంతోనే తెదేపా పుట్టింది. కాంగ్రెస్‌ను ఎన్టీఆర్‌ మట్టికరిపించారు. తెలుగువారి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు ఎన్డీయే ప్రభుత్వం.. ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించింది’’

వచ్చే ఐదేళ్లు అవకాశం ఇవ్వండి..

‘‘ఎన్డీయే సర్కారులో ప్రతిఒక్కరూ పేదల కోసం పనిచేస్తారు. ఆవాస్‌ యోజన కింద ఏపీలో 10 లక్షల ఇళ్లు ఇచ్చాం. జలజీవన్‌ మిషన్‌ కింద కోటి ఇళ్లకు తాగునీరు అందించాం. కిసాన్‌ సమ్మాన్‌ నిధితో పల్నాడు ప్రజలకు రూ.700 కోట్లు ఇచ్చాం. ఆయుష్మాన్‌ భారత్‌తో ఏపీలో 1.25 కోట్ల మందికి లబ్ధి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన యూరివర్సిటీని ఏర్పాటు చేశాం. విశాఖలో ఐఐఎం, ఐఐఈ, తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌, మంగళగిరిలో ఎయిమ్స్‌ నిర్మించాం. పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ యువత కోసం అనేక జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఇవి స్థాపించాం. వచ్చే ఐదేళ్లూ డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకే అవకాశం ఇవ్వండి. ఏపీలో నీలి విప్లవానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. మహిళలు, యువతకు కొత్త అవకాశాల సృష్టికి ప్రణాళికలు ఏర్పడుతాయి’’ అని మోదీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని