PM Modi: రామనవమి వేడుకలపై మోదీ, దీదీ మాటల యుద్ధం

బెంగాల్‌లో రామనవమి వేడుకల విషయంలో ప్రధాని మోదీకి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య మాటల యుద్ధం నెలకొంది.  

Published : 16 Apr 2024 19:54 IST

కోల్‌కతా: బెంగాల్‌లో రామనవమి వేడుకల విషయంలో ప్రధాని మోదీకి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య మాటల యుద్ధం నెలకొంది. బెంగాల్‌లో రామనవమి వేడుకలను ఆపేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్‌ శాయశక్తులా ప్రయత్నించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో అధికారుల బదిలీల్లో భాజపా జోక్యం చేసుకుంటోందని, అల్లర్లు చెలరేగితే ఆ పార్టీదే బాధ్యత అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

హౌరా నగరంలో రామనవమిని పురస్కరించుకొని బుధవారం ఊరేగింపు నిర్వహించేందుకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కు కలకత్తా హైకోర్టు అనుమతిచ్చిన ఒకరోజు అనంతరం ఈ వివాదం చోటుచేసుకుంది. గత సంవత్సరం రామనవమి వేడుకల్లో భాగంగా ఊరేగింపు సమయంలో నెలకొన్న అశాంతిని గుర్తు చేస్తూ బెంగాల్ ప్రభుత్వం ఊరేగింపు కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రతిపాదించింది. దీనిపై నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు.

మంగళవారం బాలూర్‌ఘాట్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ‘‘అయోధ్యకు రామ్‌లల్లా వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి రామనవమి వేడుకలను బెంగాల్‌లో జరగకుండా ఆపడానికి అధికార పార్టీ ప్రయత్నించింది. కానీ సత్యమే గెలిచింది. ఊరేగింపునకు కోర్టు అనుమతిచ్చింది. రేపు రామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తాము’’ అని తెలిపారు.

ఏప్రిల్ 19న జరగనున్న మొదటి దశ ఎన్నికలకు కేవలం కొద్ది రోజులే ఉండడంతో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని భాజపా భావిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘‘ముర్షిదాబాద్ డీఐజీని మార్చారు... ఇప్పుడు అక్కడ అల్లర్లు జరిగితే ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలోని శాంతిభద్రతలను ఎన్నికల కమిషన్‌ చూస్తోంది. అల్లర్లను ఎవరు సృష్టిస్తారో మాకు తెలుసు... కానీ ఈసీ ఎంపిక చేసిన అధికారులను నియమిస్తోంది. భాజపాకు అవకాశం దక్కేలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి.” అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని