పిన్నెల్లి అరెస్టుకు ఈసీ ఆదేశాలు.. హైదరాబాద్‌కు పోలీసు బృందాలు

పోలింగ్‌ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

Updated : 22 May 2024 15:04 IST

అమరావతి: పోలింగ్‌ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. పిన్నెల్లి సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి పరారైనట్టు సమాచారం.

ఈసీ ఆగ్రహం..

ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని మండిపడింది. పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సాయంత్రం 5లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై తెదేపా నేత నారా లోకేశ్‌ పెట్టిన ట్వీట్‌ను ఈసీ ప్రస్తావించింది.

లుకౌట్‌ నోటీసులు జారీ..

ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో  10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈనెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు  పోలీసులు వెల్లడించారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముకేశ్‌ కుమార్‌ మీనాను ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని