Congress: పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్‌కు పొన్నం కౌంటర్‌

నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Updated : 28 Apr 2024 14:00 IST

సిద్దిపేట: నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో తొలుత చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో భారాసకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సహా నేతలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకొంటానని బండి సంజయ్‌ చెప్పారని.. కేంద్రంలోని పదేళ్ల భాజపా పాలనలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.  అలా నిరూపిస్తే తమ పార్టీ అభ్యర్థి కరీంనగర్‌లో లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి వైదొలుగుతారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ నేతలు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హమీ ఇచ్చి మాట తప్పారని శనివారం బండి సంజయ్‌ విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, ఆసరా పింఛన్‌ రూ.4 వేలు, ఇల్లు లేని పేదలకు స్థలం, రూ.5 లక్షలు, రుణమాఫీ, రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు తదితర హామీలు అమలు చేశారా?అని ప్రశ్నించారు. వాటిని అమలు చేసినట్లు నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు ఆధారాలతో నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకొంటానని.. అవసరమైతే కాంగ్రెస్‌ అభ్యర్థి పక్షాన ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. అలా నిరూపించకపోతే 17 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి సిద్ధమా?అని సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ఆదివారం స్పందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు