Postal votes: ఎన్డీయే కూటమికి 57% పోస్టల్‌ ఓట్లు

రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పోలైన పోస్టల్‌ ఓట్లలో ఎన్డీయే కూటమి 57.10% ఓట్లు సాధించగా.. వైకాపాకు 28.11% ఓట్లు దక్కాయి. ఇండియా కూటమి 6.05% మేర ఓట్లు సాధించింది.

Updated : 09 Jun 2024 07:31 IST

వైకాపాకు 28%.. కాంగ్రెస్‌కు 6%

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పోలైన పోస్టల్‌ ఓట్లలో ఎన్డీయే కూటమి 57.10% ఓట్లు సాధించగా.. వైకాపాకు 28.11% ఓట్లు దక్కాయి. ఇండియా కూటమి 6.05% మేర ఓట్లు సాధించింది. ఎన్డీయే కూటమి, వైకాపా మధ్య పోస్టల్‌ ఓట్ల వ్యత్యాసం 28.99 శాతముంది. ఎన్డీయే కూటమిలోని మూడు పార్టీలు కలిపి 2,86,706 పోస్టల్‌ ఓట్లు సాధించగా... వైకాపా 1,41,165 ఓట్లు, ఇండియా కూటమి 30,386 ఓట్లు దక్కించుకున్నాయి. మిగిలినవాటిలో కొన్ని చెల్లలేదు, మరికొన్ని నోటాకు పడ్డాయి. మిగతావి ఇతర పార్టీలు దక్కించుకున్నాయి.మొత్తం పోలైన పోస్టల్‌ ఓట్లు 5,24,512 కాగా ఇందులో 4,44,218 ఓట్లు 94.95% ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులవి. వీటిలో అత్యధికంగా 57.10% ఓట్లు ఎన్డీయే కూటమికి దక్కాయి. 25 లోక్‌సభ నియోజకవర్గాలలో జనరల్‌ ఓట్లు ఎన్డీయేకు 53.36% దక్కగా, అక్కడ పడిన పోస్టల్‌ ఓట్లు 3.74% పెరిగాయి. వైకాపాకు జనరల్‌ ఓట్లు 39.61% రాగా, పోస్టల్‌ ఓట్లు వాటికంటే 11.5% తగ్గాయి. ఇండియా కూటమికి లోక్‌సభ స్థానాల్లో 3% ఓట్లు రాగా.. పోస్టల్‌ ఓట్లు 6.05% పడ్డాయి.

శ్రీకాకుళంలో కూటమికి 73.32% ఒంగోలులో వైకాపాకు 36.33% ఓట్లు

శ్రీకాకుళంలో ఎన్డీయే కూటమి అత్యధికంగా 73.32% పోస్టల్‌ ఓట్లు దక్కించుకుంది. తర్వాత విశాఖలో 66.03%, చిత్తూరులో 65.87%, అమలాపురంలో 63.80%, నెల్లూరులో 63.72% ఓట్లను కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. అత్యల్పంగా కడప లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కూటమికి 43.18% ఓట్లు పడ్డాయి. అరకులో 43.44%, తిరుపతిలో 47.97% ఓట్లు కూటమి అభ్యర్థులకు దక్కాయి.

  • ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో వైకాపా 36.33% పోస్టల్‌ ఓట్లు సాధించింది. విజయవాడలో 36.22%, ఏలూరులో 34.13%, నరసరావుపేటలో 33.99% ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి.
  • ఇండియా కూటమిలో.. రాష్ట్రంలోనే అత్యధికంగా అరకు నియోజకవర్గంలో సీపీఎం 19.19% ఓట్లను దక్కించుకుంది. కడపలో కాంగ్రెస్‌ 19.87% ఓట్లను సాధించింది. తిరుపతిలో 9.07%, కర్నూలులో 8.05% ఓట్లను ఇండియా కూటమి దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని