Pragya Thakur: నన్ను క్షమించలేనని మోదీ అప్పుడే చెప్పారు.. టికెట్‌ దక్కకపోవడంపై ప్రజ్ఞా ఠాకుర్‌

Pragya Thakur: గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకుర్‌కు ఈసారి భాజపా విడుదల చేసిన తొలి జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై ఆమె స్పందించారు.

Updated : 04 Mar 2024 08:35 IST

దిల్లీ: భాజపా శనివారం విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకుర్‌కు (Pragya Singh Thakur) చోటు దక్కలేదు. దీనిపై ఆమె ఆదివారం స్పందించారు. తనను క్షమించలేనని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని వ్యాఖ్యానించారు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన్ను అసంతృప్తికి గురిచేశాయని తెలిపారు.

‘‘నేను గతంలోనూ టికెట్‌ ఇవ్వమని కోరలేదు. ఇప్పుడు కూడా అడగడం లేదు. గతంలో నేను చేసిన కొన్ని వ్యాఖ్యల్లో ఉపయోగించిన పదజాలం మోదీకి నచ్చలేదు. ఈ విషయాన్ని ఆయన అప్పుడే చెప్పారు. నన్ను ఎప్పటికీ క్షమించలేనని కూడా అన్నారు. అయినా, నేను మాత్రం ఆయనను క్షమాపణలు కోరాను’’ అని ప్రజ్ఞా సింగ్‌ ఠాకుర్‌ (Pragya Singh Thakur) తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తనకు టికెట్‌ ఇవ్వలేదనే అంశంపై దృష్టి పెట్టొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

‘అసన్‌సోల్‌ భాజపా అభ్యర్థి వెనకడుగు

మాలేగావ్‌ పేలుళ్ల కేసులో జైలులో ఉన్న ప్రజ్ఞా ఠాకుర్‌ (Pragya Singh Thakur) ఆరోగ్య సమస్యల కారణంతో బయటకు వచ్చి గత ఎన్నికల్లో భోపాల్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. గాడ్సేను దేశ భక్తుడని గతంలో ఆమె అభివర్ణించడం వివాదాస్పదమైంది. ఆ విషయంపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని, ప్రజ్ఞా క్షమాపణలు అడిగినా పూర్తిగా క్షమించలేకపోతున్నానని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈసారి ఆమె టికెట్‌ దక్కించుకోలేకపోయారు. భోపాల్‌ నుంచి మాజీ మేయర్‌ ఆలోక్‌ శర్మను పార్టీ బరిలోకి దించుతోంది.

ప్రజ్ఞా ఠాకుర్‌తో (Pragya Singh Thakur) పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన సిటింగ్‌ ఎంపీలైన పర్వేశ్‌ వర్మ, రమేశ్‌ బిధూరి, జయంత్‌ సిన్హాలకు సైతం తాజా జాబితాలో చోటు దక్కలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిని ఎదుర్కోనున్న వేళ ప్రత్యర్థికి ఏ ఒక్క అవకాశమూ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే భాజపా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని