Chandrababu: విశాఖను ఐటీ కేంద్రం చేయాలనుకుంటే.. జగన్‌ గంజాయి కేంద్రంగా మార్చారు: చంద్రబాబు

విశాఖపట్నంను ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే.. జగన్‌ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 14 Apr 2024 18:17 IST

పాయకరావుపేట: విశాఖపట్నంను ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే.. జగన్‌ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.

‘‘మాస్క్‌ అడిగిన పాపానికి ఎస్సీ డాక్టర్‌ సుధాకర్‌ను అవమానించి, హింసించి ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేశారు. ఆయన ఆత్మ శాంతించాలంటే వైకాపాను ఓడించాలి. సీఎం జగన్‌ దళిత ద్రోహి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వైకాపాను భూ స్థాపితం చేయాలి. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారు. చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్‌. నరేంద్రమోదీ ఆశయం, నా అనుభవం, పవన్‌ కల్యాణ్‌ శక్తి కూడదీసుకుని ఈ రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. కూటమి అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యతమీది.. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది.

రుషి కొండను అనకొండలా మింగేశారు..

ఐదేళ్లలో ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశారు. ప్రశాంతమైన ఈ ప్రాంతాన్ని నేరస్థులకు అడ్డాగా మార్చేశారు. ఉత్తరాంధ్రలో రూ.40వేల కోట్లు దోచేసిన దుర్మార్గుడు ఈ సీఎం. రుషికొండను అనకొండలా మింగేశారు. రూ.500కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్‌ కట్టుకున్నాడు. పేద వారి ఇళ్ల నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదు. జగన్‌ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయను.. రాని వారికి 2సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తాం. దేశంలో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామని మోదీ ప్రకటించారు. అందులో మన రాష్ట్రానికి దాదాపు 30 లక్షల ఇళ్లు వస్తాయి. నేను వస్తే పరిశ్రమలు వస్తాయి.. జగన్‌ వస్తే గంజాయి వస్తుంది. విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసినా దిక్కులేదు.

పేదోడినని చెప్పుకొనే ఈ ముఖ్యమంత్రి తొమ్మిదిసార్లు విద్యుత్‌ ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు. జగన్‌ తెచ్చిన ప్రతి పథకం వెనుక పెద్ద కుంభకోణం ఉంది. కుంభకోణాలకు పాల్పడిన వారిని ఉక్కు పాదంతో తొక్కాలి. ఆకాశమే హద్దుగా ఏపీని అభివృద్ధి చేసే మేనిఫెస్టో తెచ్చాం. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తాం. తల్లికి వందనం కార్యక్రమం కింద ఏడాదికి రూ.15వేల చొప్పున, ఏప్రిల్‌ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలు చొప్పున ఇస్తాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు