PM Modi-Priyanka Gandhi: ప్రధానిగా ఆ విషయం మరిచారా? మోదీ ‘ముజ్రా’ వ్యాఖ్యలపై ప్రియాంక ఫైర్‌

PM Modi-Priyanka Gandhi: విపక్షాలనుద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రలో ఏ ప్రధాని అయినా ఇంతటి అవమానకర వ్యాఖ్యలు చేశారా? అని మండిపడ్డారు.

Published : 25 May 2024 18:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బిహార్‌ ర్యాలీలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi).. విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘ఇండియా’ కూటమి (INDIA Bloc) తన దాస్యాన్ని చాటుతూ.. ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు వారిముందు ముజ్రా (పురుషులను ఆకట్టుకునేందుకు మహిళలు చేసే ఓ రకమైన నృత్యం) చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు. వీటిపై కాంగ్రెస్‌ (Congress) అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రధాని పదవి మర్యాద పాటించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని మండిపడ్డారు.

‘‘బిహార్‌ (Bihar) ఎన్నికల ప్రచారంలో విపక్షాల (Opposition)పై ప్రధాని మోదీ అభ్యంతరకర భాషను ప్రయోగించారు. ప్రతిపక్ష నేతలను దారుణంగా అవమానించారు. చరిత్రలో ఏ ప్రధాని అయినా ఇలాంటి పదాలు ఉపయోగించారా? ప్రధాని పదవి మర్యాదను పాటించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? ప్రధాని హోదాను మేం చాలా గౌరవిస్తాం. కానీ ఈ ఎన్నికల్లో ఆయన (మోదీ) అసలు స్వరూపం బయటపడింది. ఈ దేశ ప్రజలకు ప్రతినిధిని అన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నట్లున్నారు. ఇలాగైతే భావితరాలు మన గురించి ఏం చెబుతాయి?’’ అని ప్రియాంక ధ్వజమెత్తారు.

ఎన్నికల్లో ఓటమిపై.. ఖర్గేను బలిపశువు చేస్తారు: ప్రధాని మోదీ

ప్రధాని వ్యాఖ్యలను ఇతర విపక్ష నేతలు కూడా ఖండించారు. రాజ్యాంగపరమైన ఉన్నత పదవిలో ఉన్న మోదీ తన మాటలపై నియంత్రణ కోల్పోతున్నారని, ఇది దురదృష్టకరమని ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు