PM Modi: ఎన్నికల్లో ఓటమిపై.. ఖర్గేను బలిపశువు చేస్తారు: ప్రధాని మోదీ

ఎస్సీలు, వెనకబడిన తరగతుల వారి రిజర్వేషన్లను కాజేసేందుకు ‘ఇండియా’ కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటానని ప్రధాని మోదీ తెలిపారు.

Updated : 25 May 2024 17:48 IST

పట్నా: లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి ఓటమి ఖాయమని.. దీనికి మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను కాంగ్రెస్‌ (Congress) బలిపశువును చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. అనంతరం ఆ పార్టీ ‘రాచకుటుంబం’ విదేశీ పర్యటనలకు వెళ్లిపోతుందని తెలిపారు. బిహార్‌లోని కారాకాట్‌, పాటలీపుత్రల్లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచార సభల్లో మోదీ పాల్గొని, ప్రసంగించారు. ‘ఇండియా’ కూటమి తన దాస్యాన్ని చాటుతూ.. ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు వారిముందు ముజ్రా (నృత్యం) చేస్తోందని ఆరోపించారు.

‘‘ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలో అపహరణలు, హత్యలు సర్వసాధారణమే. కొన్ని రాష్ట్రాల సీఎంలు బిహారీలను దుర్భాషలాడుతుంటే ఆర్జేడీ మాత్రం నోరు మెదపదు. వారి ఆత్మగౌరవాన్నీ పట్టించుకోదు. ప్రస్తుత ఎల్‌ఈడీ బల్బుల యుగంలోనూ లాంతరు (ఆర్జేడీ ఎన్నికల గుర్తు)తో తిరుగుతూ.. రాష్ట్రం మొత్తాన్ని చీకట్లో ఉంచి, కేవలం తన ఇంటిని మాత్రమే వెలిగిస్తోంది. భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చినవారు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. అవినీతిపరులంతా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే’’ అని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

‘మాస్టారూ.. ముందు మీ దేశం సంగతి చూస్కోండి’.. పాక్ ఎంపీకి కేజ్రీవాల్‌ చురక

ఎస్సీలు, వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను కాజేసేందుకు ‘ఇండియా’ కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటానని మోదీ తెలిపారు. ‘‘శక్తిమంతమైన భారత్‌కు ప్రపంచవేదికపై సరైన న్యాయం చేయగల ప్రధాని అవసరం. కానీ, ఈ పదవి విషయంలో విపక్ష కూటమి.. కుర్చీలాట ఆడాలనే ఉద్దేశంతో ఉంది. కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ తదితర కుటుంబ పార్టీలకు చెందినవారు ప్రధానిగా కొద్దికాలం పాటు కొనసాగాలని చూస్తున్నారు. ఎన్నికలు ముగియడానికి ముందే ప్రతిపక్ష కూటమి తన ఎగ్జిట్ పోల్స్‌తో ముందుకువచ్చింది. త్వరలో వారు ఈవీఎంలపై పడి ఏడుస్తారు’’ అని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని