Amritpal Singh: వేర్పాటువాది అమృత్‌పాల్‌.. జైలు నుంచి లోక్‌సభకు

జైలు నుంచి నామినేషన్ వేసి, స్వతంత్రుడిగా ఎన్నికల బరిలో నిలిచిన వేర్పాటువాది అమృత్‌ పాల్‌ సింగ్‌ విజయాన్ని దక్కించుకున్నారు. 

Published : 04 Jun 2024 18:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ నేత, వారిస్‌ పంజాబ్‌ దే నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని డిబ్రూగఢ్‌ జైల్లో ఉన్న అతడు.. పంజాబ్‌లోని ఖదూర్ సాహెబ్ స్థానం నుంచి గెలుపొందారు. లక్షన్నర ఓట్లకు పైగా తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ ఓటమి చవిచూశారు. అమృత్‌పాల్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

అమృత్‌సర్‌ జిల్లా అజ్‌నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్‌పాల్‌ పేరు దేశంలో మార్మోగింది. అతడు చాలాకాలం దుబాయిలో ఉన్నాడు. ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్‌సిద్ధూ మరణంతో అమృత్‌పాల్‌ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటినుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్‌నే స్థావరంగా ఎంచుకున్నాడు. అజ్‌నాలా ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపాడు. చివరికి జర్నైల్‌ సింగ్‌ గ్రామమైన రోడెవాల్‌లోని గురుద్వారాలో అతడిని అరెస్టు చేసి డిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు.

ఇందిర హంతకుడి కుమారుడి విజయం..

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడు, 45 ఏళ్ల సరబ్‌జీత్ సింగ్ ఖల్సా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ నుంచి పోటీపడిన ఆయన విజయం దక్కించుకున్నారు. ఆయన గతంలో పలు ఎన్నికల్లో పోటీ చేశారు. 2004లో బఠిండా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ బఠిండా, ఫతేగఢ్‌ సాహిబ్‌ స్థానాల నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తాజాగా ఆప్‌ అభ్యర్థి కరమ్‌జీత్‌ సింగ్ అన్మోల్‌ను ఓడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని