Loksabha polls: రాహుల్‌ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్‌

రాహుల్‌ గాంధీ ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు.

Published : 18 May 2024 20:49 IST

గువాహటి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తాను పాల్గొనే ర్యాలీల్లో భారత రాజ్యాంగాన్ని (constitution) కాకుండా చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) శనివారం ఆరోపించారు. రాహుల్‌ దగ్గరున్న పుస్తకం చైనా రాజ్యాంగం మాదిరిగా ఎరుపు రంగు కవర్‌తో ఉందని, భారత రాజ్యాంగానికి నీలం రంగు కవర్‌ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

‘‘రాహుల్ పార్టీ ర్యాలీలు, సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఎర్రటి అట్ట గల చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారు. నీలం రంగులో ఉన్న రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేయాలని చెబుతాయి. రాహుల్ తన చర్యలతో దీనిని వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఆయన చేతిలో ఉన్న రాజ్యాంగం చైనాదేనని కచ్చితంగా చెప్పగలను’’ అని బిశ్వశర్మ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. చేతిలో ఎరుపురంగు కవర్‌ ఉన్న పుస్తకంతో రాహుల్ గాంధీ పోడియం వెనక నిలబడి ఉన్న ఫొటోను శర్మ షేర్ చేశారు.

అసలైన రాజ్యాంగం ఈవిధంగా ఉంటుందని చెప్తూ బిశ్వశర్మ నీలిరంగు కవర్‌తో ఉన్న భారత రాజ్యాంగం ఫొటోను పోస్టు చేశారు. దీంతో ఆయన పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు.  ఓ నెటిజన్‌ స్పందిస్తూ ఎరుపు కవర్‌తో ఉండే రాజ్యాంగాన్ని ‘కోట్ పాకెట్ ఎడిషన్’ అని అంటారని, ప్రధాని, హోంమంత్రి వంటి వారితో పాటు దేశంలోని అగ్రనాయకులకు దీనిని ఇస్తారని పేర్కొన్నారు. పలువురు నెటిజన్లు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ల వద్ద ఇదే ఎరుపు రంగు కవర్‌తో ఉన్న రాజ్యాంగానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. ప్రధాని వద్ద ఉన్నది కూడా చైనా రాజ్యాంగమేనా అంటూ ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకూడదని వారు వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని