Rahul Gandhi: మ్యూచువల్‌ ఫండ్స్‌, షేర్లు, భూములు.. రాహుల్‌ గాంధీకి రూ.20కోట్ల ఆస్తులు

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తనకు రూ.20కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. వ్యవసాయ భూమి, బ్యాంకు డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు.

Updated : 04 Apr 2024 10:34 IST

వయనాడ్‌: కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. బుధవారం నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ర్యాలీగా వెళ్లిన ఆయన రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ (Nomination) పత్రాలు సమర్పించారు. అందులో తన నికర సంపద రూ.20కోట్లుగా వెల్లడించారు. రూ.9.24కోట్లు చరాస్తులు, రూ.11.14 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.

చరాస్తుల్లో రూ.4.33కోట్లు బాండ్లు-షేర్ల రూపంలో, రూ.3.81కోట్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉన్నాయని తెలిపారు. తన వద్ద రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ. 61.52లక్షల విలువ చేసే నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, పోస్టల్‌ సేవింగ్స్‌, బీమా పాలసీలు, రూ.15.21లక్షల విలువైన గోల్డ్‌ బాండ్లు, రూ.4.20లక్షల విలువైన ఆభరణాలు, రూ.55వేల నగదు ఉన్నట్లు వెల్లడించారు. రూ.2022-23లో తన వార్షికాదాయం రూ.కోటిగా ప్రకటించారు.

భారతమాత ఆత్మను కాపాడుకునే పోరాటమిది: రాహుల్‌ గాంధీ

స్థిరాస్తుల్లో భాగంగా దిల్లీలోని మెహ్రౌలీలో వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. ఇందులో సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా వాటాలున్నాయి. ఇది తమకు వారసత్వంగా దక్కిన ఆస్తిగా పేర్కొన్నారు. ఇక గురుగ్రామ్‌లో రూ.9కోట్ల విలువ చేసే ఆఫీస్‌ ఉన్నట్లు తెలిపారు. రూ.49.7లక్షల రుణాలు కూడా ఉన్నాయని ప్రకటించారు. తనపై భాజపా నేతలు ఫిర్యాదు చేసిన పరువు నష్టం కేసులు, అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌తో సంబంధం ఉన్న క్రిమినల్‌ కేసుల వంటి వివరాలను కూడా నామినేషన్‌లో వెల్లడించారు.

వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీపై సీపీఐ తరఫున అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. ఆమె కూడా బుధవారమే నామినేషన్‌ దాఖలు చేశారు. తనకు రూ.72లక్షల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. వారసత్వంగా వచ్చిన రూ.71లక్షల విలువైన ఆస్తి, రూ.10వేల నగదు, రూ.62వేల బ్యాంకు డిపాజిట్లు, రూ.25వేల విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు