Amit Shah: రాహుల్‌ గాంధీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు: అమిత్‌ షా

‘‘రాహుల్‌ గాంధీ నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని జైల్లో పెట్టారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత రాహుల్‌కు లేదు.’’అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తీవ్ర విమర్శలు చేశారు.

Published : 02 Apr 2024 15:04 IST

జోధ్‌పూర్: ‘‘రాహుల్‌ గాంధీ నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మందిని జైల్లో పెట్టారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత రాహుల్‌కు లేదు.’’అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తీవ్ర విమర్శలు చేశారు.

ఆదివారం దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లోక్‌తంత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) అనే నినాదంతో ప్రతిపక్ష ఇండియా కూటమి ర్యాలీ చేయడంపై   షా అసహనం వ్యక్తం చేశారు.  ప్రజాస్వామ్యానికి ఏమైందని సేవ్ డెమోక్రసీ అంటున్నారు. రూ.12 లక్షల మేర కుంభకోణాలు చేస్తేనే కదా మీ నాయకులు జైలుకు వెళ్లింది అని ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు కలిసినా మళ్లీ మోదీనే ప్రధానిగా గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఆయన తదుపరి పాలనలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందన్నారు. 

యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. పదేళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వ పాలనలో మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీలు దేశాన్ని అంధకారంలోకి  నెట్టారని అమిత్‌షా మండిపడ్డారు. 2014లో ప్రజలు మోదీకి అధికారం కట్టబెట్టిన అనంతరం ఆయన దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారన్నారు. యూపీఏ హయాంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చారని  వ్యాఖ్యానించారు. రామమందిరం నిర్మాణాన్ని ఎత్తిచూపిన ఆయన, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించలేకపోయారని విమర్శించారు. 150 ఏళ్ల నాటి చట్టాలను, 100 ఏళ్ల నాటి పార్లమెంట్ భవనాన్ని మార్చామని హోంమంత్రి అన్నారు. దేశ భద్రత గురించి అనేక చర్యలు తీసుకుంటున్నామని భాజపా హయాంలో భారత్‌లో బాంబుపేలుళ్లకు ఎవరూ సాహసించడం లేదని తెలిపారు. 

లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి భాజపా 370 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2014లో భాజపా 55శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిందని, అనంతరం 2019లో 61శాతం ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈసారి 70శాతం ఓట్లతో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని తెలిపారు. ‘‘మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. ప్రస్తుతం దేశంలో ప్రతీ వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది. ప్రతిరోజూ రూ.16,000 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. 14 కి.మీ. రహదారులను నిర్మిస్తున్నారు. ప్రతీ సెకనుకు ఒక ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడానికి మేము కృషి చేస్తున్నాము.’’అని తెలిపారు.
 ‘‘సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మమతాబెనర్జీ తన మేనల్లుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాగే అశోక్ గెహ్లాట్, లాలూ యాదవ్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే తమ కుమారులు సీఎంలు కావాలని ప్రయత్నిస్తున్నారు. భాజపా అలాంటి వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహించదు’’అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు